Telangana Election Results: అంతటా ఉత్కంఠ కలిగిస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభంకానుంది. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం పది గంటలకే ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే విజయమని చెబుతుండగా.. ఎగ్జాక్ట్ పోల్స్ తమకు శుభవార్త ఇస్తాయని బీఆర్ఎస్ ధీమాతో ఉంది. కేటీఆర్ కూడా హ్యాట్రిక్ సంబరాలు వస్తున్నాయని ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తే.. ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంల సీల్స్ ఓపెన్ చేస్తారు. దీంతో వెంటవెంటనే ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉండనుంది. టగ్ ఆఫ్ వార్ ఉండే చోట్ల కౌంటింగ్ కీలకంగా మారబోతోంది.
మరికొద్ది గంటల్లోనే ఎవరు విజేత.. ఎవరు పరాజితులో తేలనుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సెలవు రోజు కావడంతో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. ఎవరు అధికారంలోకి వస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. గతంలో మాదిరి కాకుండా టఫ్ ఫైట్ ఉండడంతో హైటెన్షన్ కనిపిస్తోంది.
ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండటంతో వీటిలో ఏదో ఒకస్థానం ఫలితం ముందుగా వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలవిధుల్లో ఉన్న ఉద్యోగులతోపాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు, దివ్యాంగులు, 80ఏళ్లు దాటిన వయోవృద్ధులుతోపాటు సుమారు 2.20 లక్షల మంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
రాష్ట్రంలోని ఆరు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ ఉండటంతో ఆరు నియోజకవర్గాల కౌంటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఒక్కో చోట 500 నుంచి 600 వరకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.ఈ ఆరు స్థానాల్లో కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు.