Temple Administration: స్వేచ్ఛ బ్యూరో: ఆధ్యాత్మికతకు నిలయాలైన దేవాలయాల సమర్థ నిర్వహణ, పారదర్శక పాలన దిశగా దేవాదాయ శాఖ కీలక అడుగు వేసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆలయాల పాలనను ఆధునిక పద్ధతుల్లో మెరుగుపరిచేందుకు ‘స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్స్’ (SITA – సిట) సంస్థను ప్రభుత్వం పునఃప్రారంభించింది. దాదాపు 12 ఏళ్లుగా మూలనపడిన ఈ ప్రతిష్టాత్మక శిక్షణా సంస్థకు మళ్లీ జీవం పోస్తూ, ఆలయాల సమగ్ర అభివృద్ధికి సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. భక్తుల రద్దీ నిర్వహణ (క్రౌడ్ మేనేజ్‌మెంట్) నుంచి ఆలయ భూముల రక్షణ వరకు అర్చకులకు, సిబ్బందికి వృత్తినైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ‘సిట’ తన కార్యకలాపాలను ప్రారంభించబోతుంది.
దేవాదాయశాఖ కేవలం ఆలయాల ఆదాయాన్ని పర్యవేక్షించే విభాగం మాత్రమే కాదని, మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడే కీలక వ్యవస్థగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం దేవాలయాల పరిపాలనలో నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ‘సిట’ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. ఈవోలకు భూములను గుర్తించడం, సర్వే చేయడం, కబ్జాలను తొలగించడంపై ప్రత్యేక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. దీంతో ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా నివారించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఉమ్మడి సంస్థల విభజన, సిబ్బంది సర్దుబాటు వంటి కారణాలతో ‘సీట’ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ సిటను హైదరాబాద్ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్‌లో ‘స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్’ కార్యాలయాన్ని పున: ప్రారంభించారు.
సాధారణంగా ఆలయాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, అకౌంట్స్ నిర్వహణ వంటి అంశాల్లో సిబ్బందికి సరైన శిక్షణ ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనిని అధిగమించడానికి ‘సిట’ వేదికగా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించడం, వారి సమస్యలను పరిష్కరించడంపై సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అంతేగాకుండా ఆన్‌లైన్ సేవలు, ఇ-దర్శన్, లడ్డూ ప్రసాదం కౌంటర్ల నిర్వహణ, డిజిటల్ అకౌంటింగ్, ఆన్‌లైన్ సేవలలో ఐటీ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఆలయ ఈఓలు (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు), ట్రస్ట్ బోర్డు సభ్యులకు పరిపాలనా పరమైన మెళకువలు నేర్పుతారు.ఆలయ ప్రాంగణాలు, కల్యాణ కట్టలు, ప్రసాద వితరణ శాలల్లో పరిశుభ్రత ప్రమాణాలను ఎలా పాటించాలో నేర్పుతారు.
Also read: కొంపముంచిన రాధ యాదవ్..రెండు క్యాచ్ లు మిస్, టీమిండియా ఎలిమినేట్ ?
రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు వేర్వేరు రీతుల్లో జరుగుతుండేవి. సిట తో అర్చకులకు ‘ఆగమ శాస్త్రం’లో రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించి, ధూప దీప నైవేద్యాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు ఒకే రకమైన శాస్త్రోక్త పద్ధతిని అమలు చేసేలా చేసింది. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఆగమ శాస్త్రాలపై, వైదిక సంప్రదాయాలపై అవగాహన కల్పించనున్నారు. భక్తులకు అందే సేవల్లో నాణ్యత పెరుగుతుందని భావిస్తోంది. దేవాలయాల భూములు కోర్టుల్లో ఉన్న వివాదాలను ఎలా ఎదుర్కోవాలి? రికార్డులను ఎలా భద్రపరచాలి?ఆలయ భూముల రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వివాదాల పరిష్కారం, లీజుల వసూళ్లలో అవకతవకలకు తావులేకుండా ఉండేలా కఠినమైన శిక్షణ ఇవ్వనున్నారు. దేవాలయాల భూముల ఆక్రమణలను అరికట్టడంతోపాటు వాటికి రక్షణ కవచంగా నిలువనున్నది. ఆలయాలకు వచ్చే కానుకలు, హుండీ ఆదాయం, విరాళాల నిర్వహణలో పూర్తి పారదర్శకత పెరుగనున్నది. అర్చకులకు, అధికారులకు మధ్య తరచూ వచ్చే సమన్వయ లోపాన్ని తొలగించేందుకు ఈ సిట సంస్థ వారధిలా పనిచేయనుంది. ఆలయ అభివృద్ధికి ఎలా పాటుపడాలనే దానిపై అవగాహన సదస్సులు నిర్వహించనుంది.
ఆలయాలకు వచ్చే కానుకలు, విరాళాలు, తలనీలాల వేలం, లీజుల ద్వారా వచ్చే ఆదాయంలో పారదర్శకత పెంచడం. అకౌంటింగ్ ఆడిటింగ్‌ను పక్కాగా నిర్వహించేలా అకౌంటెంట్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా లీకేజీలను అరికట్టబోతున్నారు. రాబోయే మూడు పనిదినాల్లో దేవాలయ సంస్కృతి-ఆగమ శాస్త్రాలు అనే అంశంపై ధార్మిక భవన్‌తోపాటు భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ వంటి ప్రముఖ క్షేత్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. టెంపుల్ మేనేజ్‌మెంట్‌లో అప్పటి వరకు ఉన్న పాత పద్ధతులకు స్వస్తి పలికి ‘డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్’ విధానాన్ని పరిచయం చేయడంలో సిట కీలక పాత్ర పోషించబోతుంది. ఆడిటింగ్ ప్రాముఖ్యతను అధికారులకు వివరించి, నిధుల దుర్వినియోగాన్ని తగ్గించనుంది.
గతంలో ప్రారంభమైనప్పటికీ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల దాదాపు 12 ఏళ్లుగా ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆలయాల పరిపాలన కూడా ఆధునీకరణ చెందాల్సిన అవసరం ఉందని భావించిన ప్రభుత్వం, దీనికి బడ్జెట్ కేటాయించి మరీ పునరుద్ధరించింది. సనాతన ధర్మ రక్షణతో పాటు, దేవాలయాల ఆస్తులను కాపాడుకుంటూ భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడంలో ‘సిట’ రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించబోతోంది.
Also Read: బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొరటాల శివ ‘NBK112’ ముహూర్తం ఫిక్స్..