Telangana Roads: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,145 రోడ్లను అభివృద్ధి చేసేందుకు 7,445 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం రూ.6,294 కోట్లను కేటాయించింది. తొలి విడతలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో 17 ప్యాకేజీలుగా చేపట్టనున్న రోడ్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. టెండర్ల కేటాయింపులను 40:60 నిష్పత్తిలో చేపట్టబోతున్నారు. ఈ పనులను నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది.
రాష్ట్రంలో రహదారుల నెట్వర్క్ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 3 దశలవారీగా పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా తొలి విడతలో 17 ప్యాకేజీల కింద రోడ్ల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు ప్రారంభించేందుకు అవసరమైన తదుపరి చర్యలపై దృష్టి సారిస్తుంది. మొత్తం 2,145 రోడ్లకు సంబంధించి 7,445 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉండే మార్గాల అభివృద్ధి ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.
హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి టెండర్ల కేటాయింపులు 40:60 నిష్పత్తిలో ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అయితే ఈ నిష్పత్తి ప్రభుత్వ నిధులు, కాంట్రాక్టర్ల పెట్టుబడి వాటాలకు సంబంధించింది. కాంట్రాక్టర్లకు పదిహేడున్నర సంవత్సరాలు అగ్రిమెంట్ తో పనులు అప్పగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు ఈ 17 ప్యాకేజీల్లో కేవలం మూడు ప్యాకేజీలకే టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. మిగిలిన ప్యాకేజీలను ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లుదక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం వాటా ప్రకారం 2500కోట్లను కాంట్రాక్టర్లకు ఇవ్వనుంది. మిగిలిన 3500కోట్లను కాంట్రాక్టర్లు భరించనున్నారు.
రోడ్ల పనులను పూర్తి చేసేందుకు సాధారణంగా 30 నెలల గడువును నిర్దేశించినప్పటికీ, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 18 నెలల్లోనే పనులు ముగించాలని ఆదేశించినట్లు సమాచారం. అంటే నిర్దేశిత గడువుతో పోలిస్తే 12 నెలల ముందుగానే పనులను పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం పనుల ప్రారంభం, కాంట్రాక్టర్ల సమీకరణ, అవసరమైన అనుమతులు, నిర్మాణ సామగ్రి సరఫరా, నాణ్యతా ప్రమాణాల అమలుపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంట్రాక్టర్లు సైట్లలో మొబలైజేషన్, క్రషర్, బీటీ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
Also read: ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్రావు ఆగ్రహం
ఈ ప్రాజెక్టుల్లో నిధుల విడుదలను పనుల పురోగతితో అనుసంధానించనున్నారు. పనులు ఏ మేరకు పూర్తయ్యాయన్న దాని ఆధారంగా 10 శాతం చొప్పున నిధులు విడుదల చేసే విధానాన్ని అనుసరించనున్నట్లు సమాచారం. మొత్తం పది విడతల్లో చెల్లింపులు జరగనున్నాయి. దీంతో పనులు పూర్తయిన దశలకు అనుగుణంగా నిధులు అందే అవకాశం ఉంటుంది.హ్యామ్ విధానంలో ప్రాజెక్టు వ్యయాన్ని ఒకేసారి పూర్తిగా చెల్లించకుండా, ఒప్పంద నిబంధనల ప్రకారం నిర్మాణ దశల్లోనూ, అనంతర కాలంలోనూ చెల్లింపులు చేపట్టడం సాధారణం. అయితే ఈ ప్రాజెక్టులకు వర్తించే నిర్దిష్ట చెల్లింపు షెడ్యూల్, ప్రతి విడతలో విడుదల చేసే మొత్తం, నిర్మాణానంతర నిర్వహణ బాధ్యతలపై ఒప్పంద నిబంధనలే తుది ప్రాతిపదికగా ఉంటాయి. ఇది ఇలా ఉంటే 3నెలలకు ఒకసారి 10శాతం ఇన్ స్టాల్ మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. పనులు పూర్తైన తర్వాత ప్రతీ 6 నెలలకు ఒకసారి ఇన్ స్టాల్ మెంట్ ఇవ్వబోతున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.6,294 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడంతో పాటు నిర్మాణ నాణ్యతను కాపాడటం కూడా ముఖ్యమే.తొలి విడుత 7,445 కిలోమీటర్ల మేర పనులు విస్తరించనున్న నేపథ్యంలో ప్యాకేజీలవారీగా లక్ష్యాలను నిర్దేశించి పురోగతిని సమీక్షించడం అవసరం. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం అమలైతే రహదారుల అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశం ఉంది. తొలివిడుత కంప్లీట్ కాగానే రెండు, మూడో విడుత రోడ్ల పనులకు ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
హ్యాం రోడ్ల పనులు దసరాకు ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే టెండర్ల ప్రక్రియలో జాప్యం కారణంగా పనుల ప్రారంభం వాయిదా పడినట్లు సమాచారం. దీపావళి తర్వాతే పనులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ఈ రోడ్లు పూర్తయితే ప్రజలకు రవాణాసౌకర్యం మెరుగుపడనుంది.మూడు విడుతల్లో 18వేల కిలో మీటర్లు హ్యాంరోడ్లను రాష్ట్రంలో చేపడుతున్నారు.
రాష్ట్రంలో తొలివిడుత 2,145 రహదారులను 7,445 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.6,294 కోట్లను కేటాయించింది. తొలి విడతలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న రహదారి పనులకు సంబంధించి 17 ప్యాకేజీల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయింది.రహదారి పనులను సాధారణంగా 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా, వీలైనంత వరకు 18 నెలల్లోనే పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ జగదీశ్వర్ తెలిపారు.
Also read: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్లైన్ లోనే..?