Explore Historic Quebrada Valley: ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేరుకోవడం మాత్రమే కాదు. అక్కడి చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలను ఆస్వాదించడం కూడా. అలాంటి అరుదైన అనుభూతిని అందిస్తోంది అర్జెంటీనాలో ప్రారంభమైన ఫస్ట్ సోలార్ పవర్ ట్రైన్. పూర్తిగా సౌరశక్తితో నడిచే ఈ రైలు, 10 వేల ఏళ్ల చరిత్ర కలిగిన లోయ గుండా ప్రయాణిస్తూ పర్యాటకులకు మరపురాని ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తోంది.
2024 జూన్‌లో ప్రారంభమైన ఈ రైలును క్వెబ్రాడా సోలార్ ట్రైన్ అని పిలుస్తారు. ఇది అర్జెంటీనాలోని జుజుయ్ ప్రావిన్స్ లో ఉన్న చారిత్రక గ్రామాలను కలుపుతూ సుమారు 42 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గతంలో ఉపయోగించిన పాత రైల్వే మార్గాన్ని అప్ గ్రేడ్ చేసి ఈ సర్వీసును ప్రారంభించారు. లాటిన్ అమెరికాలో సోలార్ పవర్ తో నడిచే తొలి రైలుగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ రైలు ప్రయాణం సాధారణ టూరిస్టు ట్రిప్ కాదు. వేల సంవత్సరాలుగా ప్రజలు ఉపయోగించిన చారిత్రక మార్గంలో కొనసాగుతుంది. ఒకప్పుడు వేటగాళ్లు, ఆదివాసీ వ్యాపారులు, ఆ తర్వాత స్పానిష్ పాలకులు ప్రయాణించిన దారిలోనే ఇప్పుడు ఈ ఆధునిక రైలు పరుగులు తీస్తోంది. ఇదే మార్గం ప్రసిద్ధ ఖపాక్ నాన్ అనే హైవే నెట్ వర్క్ లో భాగంగా కొనసాగుతోంది.
ఈ రైలు వారంలో ఏడు రోజులు నడుస్తుంది. వోల్కాన్, తుంబయా, పుర్మాకారా, మైమారా, టిల్కారా లాంటి ఐదు చారిత్రక గ్రామాలను ఈ రైలు కలుపుతుంది. ప్రయాణికులు చిన్న ట్రిప్ లేదంటే రోజంతా సాగే పూర్తి ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి స్టేషన్‌లో కొంత సమయం ఆగి గ్రామాలను కాలినడకన చూసే వీలుంటుంది. ఈ రైలులో ప్రయాణిస్తే ఆండీస్ పర్వతాల అద్భుత దృశ్యాలు, ఎర్రటి కొండలు, కాక్టస్ మొక్కలతో నిండిన లోయలు కళ్లముందు కనిపిస్తాయి. గంటకు సుమారు 33 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించడంతో ప్రతి దృశ్యాన్ని ప్రశాంతంగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. నిశ్శబ్దంగా సాగే ఈ రైలు ప్రకృతి అందాలను మరింత దగ్గర చేస్తుంది.
ప్రయాణంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాల్లో పుర్మాకారా ఒకటి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత ఏడు రంగుల కొండ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. గులాబీ, ఎరుపు, ఊదా, ఆరెంజ్ కలర్స్ లో కనిపించే ఈ కొండ ప్రకృతి ప్రేమికులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ గ్రామంలో చేతితో నేసిన లామా ఉన్ని వస్త్రాలు, మట్టి కళాఖండాలు, స్థానిక హస్తకళలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మార్గమధ్యంలో ఉన్న హోర్నిల్లోస్ మ్యూజియం ఈ లోయ చరిత్రను పరిచయం చేస్తుంది. ఇక్కడ వేల ఏళ్ల క్రితం వేటగాళ్ల నుంచి ఇంకా నాగరికత వరకు జరిగిన పరిణామాలను తెలుసుకోవచ్చు. అలాగే టిల్కారాలోని పురాతన కోట, పాత వ్యవసాయ భూములు, శతాబ్దాలుగా కొనసాగుతున్న హస్తకళల సంప్రదాయం ఈ ప్రాంత వైభవాన్ని తెలియజేస్తాయి. చరిత్ర, ప్రకృతి, సంస్కృతి, అభివృద్ధి ఒకే ప్రయాణంలో ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకునే వారికి ఈ ట్రైన్ జర్నీ మరపురాని అనుభూతిని అందిస్తుంది.
Read Also: గులాబీ రంగులో మెరిసే సరస్సులు.. ఈ అందం వెనుక ఇంత కథ ఉందా?