Kothwalguda Eco Park: హైదరాబాద్ లో నగర జీవితానికి కాస్త దూరంగా ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి కొత్త డెస్టినేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి.. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న కొత్తవాల్ గూడ ఎకో పార్క్. దీనిని అధికారికంగా ఎకో హిల్ పార్క్ గా పిలుస్తున్నారు. 85 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ పార్క్ ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఏర్పాటు చేసింది. 2026 మార్చి 6న ప్రారంభమైన ఈ పార్కులో 10 లక్షలకు పైగా మొక్కలు ఉండటం విశేషం.
పార్క్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది దక్కన్ బర్డ్స్ ఏవియరీ. సుమారు 6 ఎకరాల్లో విస్తరించిన ఈ వాక్ ఇన్ ఏవియరీలో సందర్శకులు పక్షులను దగ్గరగా చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. నాలుగు ఖండాలకు చెందిన అరుదైన, స్థానిక జాతుల పక్షులు ఇందులో ఉన్నాయి. సుమారు 6,500 పక్షులతో ఏర్పాటైన ఈ భారీ ఆవరణ సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ప్రత్యేక జాలీ నిర్మాణంతో ఆకట్టుకుంటుంది. పక్షులను కేవలం దూరం నుంచి చూడటమే కాకుండా, ఏవియరీలో ఫీడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను కూడా పొందే అవకాశం ఉంది. పిల్లలతో కలిసి వెళ్లే ఫ్యామిలీస్ కు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
ఎకో హిల్ పార్క్‌లో మరో ఆసక్తికరమైన ఎక్స్ పీరియెన్స్ ఎలివేటెడ్ బోర్డ్ వాక్. సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున్న ఈ నడకదారి నేల నుంచి దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. పర్యావరణానికి అనుకూలమైన కాంపోజిట్ కలపతో దీనిని నిర్మించారు. బోర్డ్ వాక్ పై నడుస్తూ పార్క్ విస్తీర్ణాన్ని, చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ హిమాయత్ సాగర్ వైపు కనిపించే సూర్యాస్తమయ దృశ్యం ఈ ప్రదేశానికి మరో ప్రత్యేకతను తీసుకొస్తుంది.
ప్రకృతిని మరింత దగ్గరగా పరిచయం చేసేందుకు పార్క్ లో ప్రత్యేకమైన బొటానికల్ గార్డెన్లు ఏర్పాటు చేశారు. జపనీస్ గార్డెన్‌లో ప్రశాంతమైన జెన్ వాతావరణం కనిపిస్తుంది. బటర్ ఫ్లై గార్డెన్ లో సీతాకోకచిలుకలు, ఇతర పరాగ సంపర్క కీటకాలను ఆకర్షించే మొక్కలను పెంచుతున్నారు. దక్కన్ ప్రాంతానికి అనుకూలంగా తక్కువ నీటితో పెరిగే మొక్కలు, సక్యూలెంట్లతో రాక్ గార్డెన్‌ను రూపొందించారు. దీంతో ఒకే పార్కులో భిన్నమైన ప్రకృతి వాతావరణాలను ఆస్వాదించవచ్చు.
పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం, సహజ ఆట ప్రదేశాలు, పిక్నిక్ లాన్‌లు, ఫుడ్ కోర్ట్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. పార్క్ లో తిరిగేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో పెద్దలు, చిన్నారులు కలిసి రోజంతా ప్రశాంతంగా గడిపేలా ఏర్పాట్లు చేశారు.
ఈ పార్క్ ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే, పెద్దలకు రూ.100, 5 నుంచి 10 ఏళ్ల పిల్లలకు రూ.50గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. దక్కన్ బర్డ్స్ ఏవియరీకి మాత్రం ప్రత్యేక టికెట్ ఉంటుంది. సాధారణ రోజుల్లో ఒక్కొక్కరికి రూ.150, వీకెండ్, సెలవు రోజుల్లో రూ. 200 చెల్లించాలి. ఏవియరీలో పక్షులకు చేతితో ఫుడ్ పెట్టాలంటే అడిషనల్ గా రూ.200 ఖర్చవుతుంది. పార్క్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.