Srisailam Expressway: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు సురక్షితమైన , వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ రహదారి అభివృద్ధి కోసం సుమారు రూ. 7,600 కోట్ల భారీ అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే తుది అనుమతులు లభిస్తాయని.. ఆ వెంటనే పనులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టును రెండు ప్రధాన భాగాలుగా విభజించారు. మొదటి దశలో హైదరాబాద్ నుండి మన్ననూర్ వరకు ఉన్న రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు. రెండో దశలో అత్యంత కీలకమైన మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు సుమారు 52 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పర్యావరణాన్ని రక్షించేలా ఈ కారిడార్ డిజైన్ చేయడం విశేషం. దీనివల్ల అటవీ మార్గంలో జంతువులు వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండదు.
ఈ రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. భక్తులు ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి, మల్లికార్జున స్వామిని దర్శించుకుని సాయంత్రానికల్లా తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చు. ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన మలుపుల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయి, రోడ్డు భద్రత మెరుగుపడుతుంది. భక్తుల సౌకర్యం, వన్యప్రాణుల రక్షణే పరమావధిగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మార్చి 31న లక్ష ఇళ్ల పంపిణీ.. మంత్రి కీలక నిర్ణయం!