Indian Railway Recruitment 2025: భారతీయ రైల్వే సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 10వ తరగతి పాసై, ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి రైల్వేలో ఉద్యోగం పొందే సువర్ణ అవకాశాన్ని అందిస్తున్నది. తూర్పు మధ్య రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) rrcecr.gov.in అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి.
1,154 పోస్టులకు నోటిఫికేషన్
తూర్పు మధ్య రూల్వే రైల్వే సంస్థ పరిధిలోని మొత్తం 1,154 పోస్టులకు సంబంధించిన నియామకాలను చేపట్టనున్నట్లు RRC వెల్లడించింది. అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 14లోగా అప్లై చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఆయా పోస్టుల వివరాలు, ఆయా పోస్టులకు కావాల్సిన విద్యార్హత గురించి ముందుగా తెలుసుకోండి..
ఆయా డివిజన్లలో పోస్టుల వివరాలు
దానపూర్ డివిజన్ – 675 పోస్టులు
ధన్‌బాద్ డివిజన్ – 156 పోస్టులు
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ డివిజన్ – 64 పోస్టులు
సోన్‌పూర్ డివిజన్ – 47 పోస్టులు
సమస్తిపూర్ డివిజన్ – 46 పోస్టులు
ప్లాంట్ డిపో / పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ – 29 పోస్టులు
క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్ / హర్నాట్ – 110 పోస్టులు
మెకానికల్ వర్క్ షాప్ / సమస్తిపూర్ – 27 పోస్టులు
రైల్వేలో ఉద్యోగం పొందడానికి కావాల్సిన విద్యార్హత
రైల్వే బోర్డు తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థి సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి.
రైల్వేలో ఉద్యోగం పొందడానికి వయోపరిమితి
ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు కనీస వయోపరిమితి 15 సంవత్సరాలు కాగా, గరిష్ట వయోపరిమితి 24 సంవత్సరాలుగా నిర్ణయించారు.
దరఖాస్తు కోసం అభ్యర్థులు చెల్లించాల్సిన ఫీజు
ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వారు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: దేశంలో పట్టాలెక్కిన తొలి రైలు ఇదే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందంటే?
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే?
తాజాగా పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ అనేది మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది. టెన్త్ లో సగటున 50% మార్కులు, ITI పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఉంటుంది. మెరిట్ జాబితాలో రెండింటికీ సమాన ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.
నోట్:- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) rrcecr.gov.in అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి పూర్తి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవడం మంచిది.
Read Also: ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు.. ఒక్కో రైలు ఎన్ని వేల కిలో మీటర్లు వెళ్తుందో తెలుసా?
Read Also: చిన్న పిల్లలు ఫ్రీగా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు.. హాఫ్ టికెట్ ఏ వయసు నుంచి తీసుకోవాలంటే?