Andhra Premier League: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ {APL} సీజన్ 4 టోర్నీ శుక్రవారం రోజు ఏసిఏ – విడిసిఏ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సీజన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నటుడు విక్టరీ వెంకటేష్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025లో 21 లీగ్ స్టేజ్, 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లు కలిపి… మొత్తం 25 మ్యాచ్ లు నిర్వహించబడతాయి. ఈ సీజన్ లో ఏడు జట్లు తలపడుతున్నాయి.
Also Read: Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్
వీటిలో అమరావతి రాయల్స్ కెప్టెన్ గా హనుమ విహారి, భీమవరం బుల్స్ కెప్టెన్ గా నితీష్ కుమార్ రెడ్డి, విజయవాడ సన్ షైనర్స్ కెప్టెన్ గా అశ్విన్ హెబ్బర్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ కెప్టెన్ గా షేక్ రషీద్, కాకినాడ కింగ్స్ కెప్టెన్ గా శ్రీకర్ భరత్, తుంగభద్ర వారియర్స్ కెప్టెన్ గా మహిప్ కుమార్, సింహాద్రి వైజాగ్ లయన్స్ కెప్టెన్గా రికీ భూయి వ్యవహరిస్తున్నారు. ఇక ఈ టోర్నీలో తొలి రోజు కాకినాడ కింగ్స్ తో అమరావతి రాయల్స్ పోటీ పడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అమరావతి రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ఆసక్తిగా జరుగుతున్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలోకి వెళ్ళింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన కాకినాడ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కాకినాడ కింగ్స్ జట్టులో సాయి రాహుల్ 49 బంతుల్లో 96 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రీకర్ భరత్ 93 పరుగులు చేశారు. కానీ వీరిద్దరూ సెంచరీలు చేజార్చుకున్నారు. ఇన్నింగ్స్ చివర్లో వికెట్లు పడినప్పటికీ కాకినాడ కింగ్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఇక అమరావతి జట్టు బౌలర్లలో బి. సంతోష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. మల్లికార్జున, అయ్యప్ప, బి యశ్వంత్ చెరో వికెట్ పడగొట్టారు. ఇదే సమయంలో వర్షం ఆటంకం కలిగించడంతో కాసేపు మ్యాచ్ ని నిలిపివేశారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అమరావతి జట్టుకు 14 ఓవర్లలో 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
Also Read: Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?
దీంతో బ్యాటింగ్ కి దిగిన అమరావతి జట్టు 13.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. అమరావతి జట్టులో హనుమ విహారి 39, v.v.v. విజయ్ 30, k.కరన్ షిండే 28, పి.పాండురంగరాజు 26, ఎస్.వి రాహుల్ 16, వై సందీప్ 16 పరుగులు చేశారు. కాకినాడ కింగ్స్ నుండి పిన్నింటి తపస్వి నాలుగు వికెట్లు తీసి అమరావతి రాయల్స్ పై ఒత్తిడి తెచ్చాడు. మొదట్లో కాస్త ఒత్తిడికి గురైన అమరావతి రాయల్స్ కెప్టెన్ హనుమ విహారి, కరణ్ షిండే ఆకర్షణీయమైన ఇన్నింగ్స్ చేశారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మొదటి గెలుపును జోడించారు. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హనుమ విహారి, టాప్ స్కోరర్ గా సాయి రాహుల్, టాప్ బౌలర్ గా తపస్వీ లు పురస్కారాలు అందుకున్నారు.