Puri RathYatra 2026: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర గురువారం (జులై 16) ఘనంగా మెుదలైంది. 9 రోజుల పాటు సాగే ఈ యాత్రను వీక్షించేందుకు ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతుంటారు. ఈసారి కూడా భారీగా భక్తజనం తరలి వచ్చే అవకాశం ఉండటంతో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పూరీని కలుపుతూ మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ముఖ్యంగా జగదల్‌పూర్ – పూరీ, రాయగడ – పూరీ మార్గాల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి.
జగదల్‌పూర్ నుంచి పూరీ వెళ్లే భక్తుల కోసం ఈ ప్రత్యేక రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రత్యేక రైలు (నెం. 08553) జూలై 15, జూలై 23 తేదీలలో నడవనుంది. ఉదయం 6 గంటలకు జగదల్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 1:40 గంటలకు పూరీ చేరుకుంటుంది. అటు నుంచి మరో రైలు (నెం. 08554) తిరుగు ప్రయాణంలో జూలై 16, 24 తేదీలలో పూరీ నుంచి ప్రారంభమవుతుంది. ఇది రాత్రి 7:15 గంటలకు పూరీలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:15 గంటలకు జగదల్‌పూర్ చేరుకుంటుంది.
దక్షిణ ఒడిశా నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే రాయగడ – పూరీ మధ్య కూడా ప్రత్యేక రైలును తీసుకొచ్చింది. రథయాత్ర జరిగే రోజుల్లో రైల్వే అధికారులు ప్రకటించిన తేదీల్లో ఇది ప్రయాణించనుంది. మార్గమధ్యంలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతూ ఇది వెళ్లనుంది. ఈ రైలు వల్ల దక్షిణ ఒడిశా ప్రాంత భక్తులకు పూరీ చేరుకోవడం ఎంతో సులువవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ జగదల్‌పూర్ – పూరీ స్పెషల్ (08553/08554).. జైపూర్, కోట్‌పాడ్, కోరాపుట్, రాయగడ, గుణుపూర్, పార్లాకిమిడి, పలాస, ఖుర్దా రోడ్డు వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతూ పూరీ చేరుకుంటుందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read: వాన చినుకుల్లో.. ప్రకృతి అందాలు.. ఈ 6 హిల్ స్టేషన్లు మీ కోసమే!
రథయాత్ర సమయంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి భక్తులు తమ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. టిక్కెట్లను వీలైనంత త్వరగా బుక్ చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. అలాగే రైలు వేళలు లేదా ప్లాట్‌ఫారమ్ వివరాలలో ఏవైనా మార్పులు ఉంటే తెలుసుకోవడానికి ప్రయాణానికి ముందే అధికారిక రైల్వే వెబ్‌సైట్లు లేదా యాప్‌ల ద్వారా తాజా సమాచారాన్ని చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: వన్‌ప్లస్ సంచలనం.. అమెరికా, యూరప్ మార్కెట్లకు గుడ్ బై.. మరి భారత్ సంగతేంటి?