Visakhapatnam News: విశాఖ సిటీలో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. చాలామంది ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు తగ్గిన తర్వాత ఇంటికి వచ్చారు.
విశాఖలో భూకంపం
మొంథా తుపానుతో హడలిపోయారు విశాఖ వాసులు. ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి తేరుకుంటున్నారు. ఇంతలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున అంటే 4 నుంచి 4.30 మధ్య పలుమార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ముఖ్యంగా విశాఖ సిటీ పరిధిలోని ఆరిలోవ, అడవివరం, మధురవాడ, రుషికొండ, కైలాసపురం, విశాలాక్షినగర్, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తి వంటి ప్రాంతాల్లో కొన్నిసెకన్ల పాటు కంపించినట్టు అక్కడి ప్రజలు చెబుతున్నారు.
ఇళ్ల నుంచి జనాలు పరుగులు
కొన్ని చోట్ల శబ్దాలు వచ్చినట్లుగా వెల్లడించారు. ఈ పరిణామంతో నగరవాసులు కలవరపాటుకు గురయ్యారు. వేకువజామున ఆఫీసులకు వెళ్లేవారు నిద్రలేచే సరికి ప్రకంపనలు జరగడంతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు అయ్యింది.
భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. దీంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. నార్మల్‌గా విశాఖకు సునామీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఉన్నట్లుండి చిన్న ప్రకంపనలు తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
ALSO READ: అడవి ఏనుగులను ఏఐతో కట్టడి, అదెలా సాధ్యం
అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. జి.మాడుగుల సమీపంలోని 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. సోమవారం అర్థరాత్రి ధాటిన తర్వాత టిబెల్‌లో దాదాపు రెండున్నర గంటల సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అక్కడ 4.7 తీవ్రతో వచ్చింది. నేపాల్ లో 4.21 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వచ్చిన భూప్రకంపనలు భారత్-నేపాల్-బంగ్లాదేశ్-చైనా-భూటాన్ లపై ప్రభావం చూపింది.