Rain Alert: తెలంగాణలో నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ వాగులు, వంకలై పారాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మళ్లీ ముసురు కమ్మేసింది. మొన్నటి మొంథా తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఇప్పుడే తేరుకుంటున్న వరంగల్ జిల్లాను మళ్లీ మొదలైన వర్షం భయపెడుతోంది. వరంగల్, హనుమకొండలో ఇప్పటికే వర్షం మొదలైనప్పటికీ స్టేషన్ ఘనపూర్, జనగామ ప్రాంతాలలో చిరుజల్లులు పడుతున్నాయి. మరోవైపు వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తి నీట తడిసింది. ఉన్నపళంగా వర్షం కురుస్తుండటంతో పత్తి బస్తాలను షెడ్డులలోకి తరలించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు..
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగలు ఎండ కొట్టి రాత్రిల్లు కుమ్మేస్తుంది. రాత్రిళ్లు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, గద్వాల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ఏపీలో భారీ వర్షాలు..
ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Also Read: కృష్ణా జిల్లాలో మొదలైన వైఎస్ జగన్ పర్యటన..
ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశలో గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు, ఉరుములు, మెరుపులు చోటుచేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిస్తాయి. రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దక్షిణ కోస్తా తో పాటుగా రాయలసీమలోనూ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంతేకాకుండా మత్స్య కారులు రెండు రోజులు పాటు వేటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.