Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. మంగళవారం ఉదయం కూడా ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారింది. ప్రజలు బయటకు వెళ్లి ఊపిరి పీల్చడమే కష్టంగా మారింది.
ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) తాజా గణాంకాల ప్రకారం, ఆలీపూర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 421 వద్ద నమోదైంది.
ఆలీపూర్ – 421, ఆనంద్ విహార్ – 412, అశోక్ విహార్ – 369, ఆయా నగర్ – 216, భావన – 402, బురారి క్రాసింగ్ – 385, చాందిని చౌక్ – 325, మధురా రోడ్డు – 328, ఐటీఓ ఢిల్లీ – 349, వివేక్ విహార్ – 390, వాజీపూర్ – 407, ఇండియా గేట్ – 360, ఈ గణాంకాలు చూస్తే ఢిల్లీలో ఒక్క ప్రాంతం కూడా సేఫ్ జోన్‌లో లేదని స్పష్టమవుతోంది.
గాలి నాణ్యత ఈ స్థాయిలో పడిపోవడం వల్ల, పిల్లలు, వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రుల్లో శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అనేక మంది తలనొప్పి, కంటి దురద, గొంతు ఇన్‌ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
కాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
కాలుష్యానికి మీరంటే, మీరే కారణం అంటూ కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా ఢిల్లీ ప్రభుత్వం వాహనాల కోసం ఒడ్-ఈవెన్ స్కీమ్ పునరుద్ధరించాలని పరిశీలిస్తోంది. పాఠశాలలు పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. కట్టడ పనులపై తాత్కాలిక నిషేధం అమల్లోకి వచ్చింది. కానీ ఈ చర్యలతో కాలుష్య స్థాయి తగ్గే సూచనలు కనబడడం లేదు. వాతావరణంలో గాలి ప్రసరణ తగ్గడం వల్ల పొగమంచు, కాలుష్య కణాలు ఒకే చోట నిల్వవుతున్నాయి.
Also Read: డాక్టర్ ఇంట్లో భారీగా డ్రగ్స్.. రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం
పర్యావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఢిల్లీలో గాలి ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. ఈ స్థాయిలో గాలి పీల్చడం రోజుకు 10 సిగరెట్లు పొగత్రాగినంత హానికరమని చెప్పవచ్చు అని చెబుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, N95 మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించారు.