Bapatla School Bus Driver: ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలుగజేస్తున్నాయి. ప్రైవేట్ బస్సు అంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. బస్సుల ఓవర్ స్పీడ్, బస్సులకు సరైన ఫిట్ నెస్ లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు తప్పడం లేదు. ఈ ప్రమాదాల్లో చిన్న పసికందుల నుంచి పెద్ద వాళ్ల దాకా, ఎందరో అమాయకులు దుర్మరణం పాలవుతున్నారు. డ్రైవర్లు ఎంత అప్రమత్తంగా వ్యవహరించినా, రోడ్డు మీద అవతలి వాహానాల డ్రైవర్ తప్పిదాల కారణంగా ప్రమాదం తప్పడం లేదు. అయితే బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి 40 మంది పిల్లల ప్రాణాలను కాపాడారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన 67 ఏళ్ల శెట్టిపల్లి నాగరాజు, పూసపాడు అడ్డరోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు డ్రైవర్‌గా పని చేసుకుంటున్నారు. శనివారం సాయంత్రం స్కూల్ టైం ముగిసిన తరువాత యధావిధిగా పిల్లలను వారి ఇంటికి తీసుకెళ్తున్నారు. దగ్గుబాడు-నాయుడువారిపాలెం మధ్యకు రాగానే ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో బస్సును పక్కకు నిలిపివేశారు. గమనించిన స్థానికులు నాగరాజును స్థానిక అసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనతో నాగరాజు నివాసం ఉండే ఇంకొల్లులోని శివబ్రహ్మకాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
READ ALSO: Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 10 మంది మృతి
నాగరాజు రియల్ హీరో: లోకేష్
నాగరాజు మృతిపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఇంకొల్లుకు చెందిన ప్రైవేటు స్కూలు బస్సు డ్రైవర్ శెట్టిపల్లి నాగరాజు గుండెపోటుకు గురైనప్పటికీ 40మంది చిన్నారులను కాపాడిన ఘటన నన్ను కదిలించింది. ప్రాణంపోతున్నా విద్యార్థులను సురక్షితంగా కాపాడిన నాగరాజు రియల్ లైఫ్ హీరోగా నిలిచిపోతారు. నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.’’ అని పేర్కొన్నారు.