CM Chandrababu: లండన్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సఫలమయ్యారు. సోమవారం లండన్‌లో హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజా, యూరప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజాతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వారికి వివరించిన అనంతరం, రాష్ట్రంలో దశలవారీగా రూ. 20 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో హిందుజా గ్రూప్ అవగాహనా ఒప్పందం (MOU)పై సంతకాలు చేసింది.
ఈ ఒప్పందంలో భాగంగా పలు కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. విశాఖలోని హిందూజా థర్మల్ ప్లాంట్ ప్రస్తుత 1,050 మెగావాట్ల సామర్ధ్యానికి అదనంగా, 800 మెగావాట్ల చొప్పున రెండు కొత్త యూనిట్లను స్థాపించి, మరో 1,600 మెగావాట్ల సామర్ధ్యాన్ని విస్తరించనుంది. రాయలసీమలో భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.
ముఖ్యంగా, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాల తయారీ యూనిట్‌ను హిందుజా నెలకొల్పనుంది. దీనికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా తీసుకురానుంది. అనంతపురం, కర్నూలు, అమరావతిలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఏర్పాటును కూడా పరిశీలించనుంది.
ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ పెట్టుబడులు కీలకం కానున్నాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పరిశ్రమలకు అత్యుత్తమ వాతావవరణం కల్పిస్తామని, హిందుజా ప్రతిపాదనలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా ప్రత్యేక ‘ఫాస్ట్-ట్రాక్ విండో’ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాలపై ముఖ్యమంత్రి దృష్టి
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్‌లో పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ రోల్స్ రాయిస్ గ్రూప్ ప్రతినిధులతో, అలాగే శ్రామ్ (SRAM), శామ్కో (SAMCO) హోల్డింగ్స్ అధినేతలతో కీలక చర్చలు జరిపారు.
ఏరో ఇంజిన్స్, డీజిల్ ప్రొపెల్షన్ సిస్టమ్స్ తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రోల్స్ రాయిస్ సంస్థ సీటీఓ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) నిక్కీ గ్రేడీ స్మిత్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో అందుబాటులో ఉన్న వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం వారికి వివరించారు. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్ రిపెయిర్స్ ఓవర్ హాలింగ్ (MRO) యూనిట్ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను ప్రస్తావించారు.
భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎకోసిస్టం, ఎమ్మార్వో ఫెసిలిటీ ఏర్పాటుకు గల అవకాశాలను కూడా వెల్లడించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ఉత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని, విశాఖ, తిరుపతిలలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రోల్స్ రాయిస్ ప్రతినిధులను కోరారు.
అనంతరం, SRAM & MRAM గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో సెమీ కండక్టర్స్ మరియు ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు SRAM & MRAM గ్రూప్ ఆసక్తి చూపింది. ఈ సంస్థలకు రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా సీఎం చంద్రబాబు వివరించారు.