AP Govt: మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో కీలకపాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటోంది. డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం తనవంతు సహకారం అందిస్తోంది. డ్వాక్రా మహిళల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.
మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. డ్వాక్రా సంఘాల ఇచ్చే నిధుల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సరికొత్త ఆలోచన చేసింది. మన డబ్బులు.. మన లెక్కలు పేరిట AI ఆధారిత యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ 260 చోట్ల పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
డిసెంబరుకి రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల మంది డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా పొదుపు సంఘాల మహిళలు తమ ఆర్థిక లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. ఎలాంటి అవినీతి అక్రమాలకు ఎలాంటి తావు ఉండదు.
ఏపీలో ప్రతీ ఏటా డ్వాక్రా మహిళలు భారీగా లావాదేవీలు చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా ఏటా 40 వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే తిరిగి చెల్లిస్తున్నారు కూడా. పెద్ద మొత్తంలో నిధులు కావడంతో ప్రతి నెలా ఎక్కడో ఒకచోట నిధుల గోల్‌మాల్ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ హయాంలో భారీగా అవకతవకలు జరిగినట్టు పాలక పక్షం పలుమార్లు ప్రస్తావించింది కూడా.
ALSO READ: అక్టోబర్ నాలుగున ఖాతాల్లో 15 వేలు చెక్ చేసుకోండి
ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కూటమి సర్కార్ మన డబ్బులు-మన లెక్కలు పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకు ఖాతా వివరాలను ఫోన్‌లో తెలుసుకోవచ్చు. తమ గ్రూపు ఎంత మొత్తంలో నిధులు బ్యాంకుల నుంచి తీసుకుంది, ఇప్పటివరకు ఎంత కట్టింది? ఇంకా పెండింగ్ ఎంత వుంది అనేది తెలుసుకోవడం ఈజీ కానుంది.
ఈ విషయాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బంది, బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు. తమ దగ్గరున్న ఫోన్‌లో ఒక క్లిక్ చేస్తే చాలు డ్వాక్రా ఖాతా స్టేట్‌మెంట్ క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది.
ఇప్పటివరకు డ్వాక్రా సంఘాల సభ్యులకు రకరకాల సమస్యలు ఎదురయ్యాయి. ఇతరుల పేర్లపై రుణాలు తీసుకున్నవారు, క్రమం తప్పకుండా చెల్లించిన వాయిదాలు బ్యాంకుకు చేరకపోవడం వంటి వెలుగుచూసేవి. ఇక పొదుపు, వడ్డీ లెక్కలు తెలియక ఇబ్బందులు పడిన సందర్భాలు లేకపోలేదు. దీనికితోడు సంఘాల సమావేశాలు, లెక్కలు పకడ్బందీగా నిర్వహించకపోవడం వంటివని తేలింది.
ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కొత్తగా యాప్ వచ్చేసింది. బ్యాంకుల నుంచి నిధులు తీసుకున్న సంఘం పేరు, ఐడీ, సభ్యుల సంఖ్య అందులో ఉంటాయి. ప్రతి సభ్యురాలి వ్యక్తిగత వివరాలు ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ఫోన్ నంబర్ సహా అన్నీ ఉంటాయి. సభ్యులు చేసిన పొదుపు అన్నీ అందులో కనిపిస్తాయి.
బ్యాంకు రుణాలు, స్త్రీనిధి, వీవో రుణాల వివరాలు క్లియర్ గా ఉంటాయి. నెల నెలా చెల్లించిన వాయిదాలు, ఇంకా కట్టాల్సిన వాయిదాలు అందులో కనిపిస్తాయి. ఒకవేళ లావాదేవీల్లో తేడా ఉంటే యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. నమోదు చేసిన ఫిర్యాదులు వారం రోజుల్లో పరిష్కరిస్తారు. అన్ని సంఘాల లావాదేవీలను రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది.