AP Assembly: సినీ పరిశ్రమను గత సీఎం జగన్ ఎలా అవమానించారు అన్న విషయంపై ఏపీ అసెంబ్లీలో వచ్చిన ప్రస్తావన కాస్తా.. మెగా-నందమూరి ఫ్యాన్ వార్ కు దారి తీసింది. బాలకృష్ణ ఒక స్టెప్ ముందుకేసి మాట్లాడడం.. చిరంజీవి కూడా ఘాటుగానే స్టేట్ మెంట్ రిలీజ్ చేయడం, వీటికి తోడు సోషల్ మీడియాలో అభిమానుల వార్ .. ఈ దుమారం ఎక్కడికో వెళ్తోంది. పాత పగలన్నీ బయటకు వస్తున్నాయ్. మేమే తోపు అన్న లెవెల్ కు కామెంట్లు వెళ్తున్నాయ్. సో చిరంజీవి-బాలకృష్ణ మధ్య నివురుగప్పిన నిప్పు ఇప్పుడు మరోసారి బయటికొచ్చిందా? చిరు అమెరికా నుంచి వచ్చాక ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందన్న హైటెన్షన్ పెరుగుతోంది.
అసలే ఏపీ రాజకీయం మరో లెవెల్. ఇందులో సినిమా రాజకీయం మిక్సయితే కథలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడదే కాంట్రోవర్సీ రోస్ట్ అవుతోంది. కొందరికిది ధమ్ కీ బిర్యానీ విత్ డబుల్ మసాలా అన్నట్లుగా ఉంటుంది. ఇంకొందరు సినిమా చూస్తారు. ఇంకొందరు ఈ మంటల్ని ఎగదోసే ప్రయత్నం చేస్తారు. గొడవ మరింత ముదిరితే బాగుంటుందనుకుంటారు. సో ఇందులో ఎవరి గేమ్ వారిదే. చిరంజీవి లాంటి ఇండస్ట్రీ పెద్ద మనిషిని పట్టుకుని ఏకవచనంతో ఎవడు అని అంటావా అని వైసీపీ లీడర్లు.. జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే జవాబు కూడా అంతే ఘాటుగా ఉంటుందని కౌంటర్లు ఇలా వస్తూనే ఉన్నాయి.
FDC లిస్టులో 9వ పేరు పెట్టారని బాలయ్య ఫైర్
చిరంజీవికి నాడు జగన్ నివాసంలో జరగని అంశంలో అసెంబ్లీలో గొప్పగా చెబుతున్నారని కానీ తనను మాత్రం ఎఫ్‌డీసీ లిస్టు తయారీ విషయంలో తొమ్మిదో పేరుగా పెట్టి అవమానించారని బాలకృష్ణ ఫీలయ్యారు. సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్ద ఉంది. ఆ శాఖ మంత్రి కందుల దుర్గేశ్. పార్టీ పవన్ కల్యాణ్ ది. ఈ రెండు పార్టీలూ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే బాలకృష్ణను ఇలా 9వ పేరుగా పెట్టి అవమానించారన్న విషయం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. బాలకృష్ణ మాట్లాడితేగానీ తెలియలేదు. వెంటనే 9వ నెంబర్ లో తన పేరు పెట్టినవాడెవడు అని కందుల దుర్గేశ్ కు ఫోన్ చేసి అడిగానని కూడా చెప్పుకున్నారు బాలయ్య. మర్యాద ఇవ్వడం మానవత్వం అన్నారు. తనను అలా అవమానించి ఇప్పుడు అసెంబ్లీలో చిరంజీవిని గొప్పగా ప్రజెంట్ చేయడం బాలకృష్ణకు నచ్చలేదు. అదీ జరిగిన మ్యాటర్.
జగన్ షాకుల మీద షాకులిచ్చారా?
వైసీపీ హయాంలో శాంతిభద్రతల్ని, ప్రజల హక్కుల్ని ఎలా కాలరాశారో, అప్పటి విపక్ష నాయకుల్ని అక్రమ అరెస్టులతో ఎలా వేధించారన్న విషయాలపై ఎమ్మెల్యే కామినేని అసెంబ్లీలో వివరించే ప్రయత్నం చేస్తూ సినిమా నటులకు జరిగిన అవమానాన్ని ప్రస్తావించారు. అందరినీ వాహనాలు దిగి నడిపించడం, పోసాని లాంటి వాళ్లను చర్చలో కూర్చోబెట్టడం, ఇలా షాకుల మీద షాకులు జగన్ ఇచ్చారని మాట్లాడారు. చిరంజీవి గట్టిగా అడిగే సరికి జగనే స్వయంగా మీటింగ్ కు హాజరయ్యానడంతో బాలకృష్ణకు కోపం రావడం, వీటిపై చిరంజీవి రియాక్ట్ అవడం, అటు వైసీపీ లీడర్లు ఫైర్ అవడం ఇవన్నీ జరిగాయి.
బాలాకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్న చిరు
మొత్తం ఎపిసోడ్ పై అమెరికాలో ఉన్న చిరంజీవి వెంటనే స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. దర్శక నిర్మాతల కోరిక మేరకే జగన్ ను కలిశామని, వారు కూడా సాదరంగా ఆహ్వానించారన్నారు. పైగా బాలకృష్ణకు ఫోన్ లో సంప్రదిస్తే అందుబాటులోకి అస్సలు రాలేదన్నారు. తాను ఆ రోజు చొరవ తీసుకోవడంతోనే అప్పట్లో ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంచేందుకు అంగీకరించిందని, ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసిందన్నారు. వీరసింహారెడ్డి సినిమాకైనా, వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్‌ల ధరలు పెరగడానికి కారణమైందని గుర్తు చేస్తూ తాను సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలోనే మాట్లాడతానంటూ స్టేట్ మెంట్ రిలీజ్ చేసి బాలకృష్ణకు గట్టిగా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
బాలకృష్ఱ మందుకొట్టి మాట్లాడారన్న పేర్ని
అసలు 80 ఏళ్ల వయసులో కామినేని శ్రీనివాస్ మంత్రి పదవి కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. అటు బాలకృష్ణ మాట్లాడిన మాటల్ని కూడా తిప్పికొట్టారు. మాన్షన్ హౌస్ మందు గట్టిగా కొట్టి సభలో నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. అసలు అసెంబ్లీ ముందు బ్రీత్ అనలైజ్ పెట్టాలన్నారు పేర్ని నాని. పవన్ కల్యాణ్ కు క్రేజ్ పెరుగుతుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. అసలు చిరంజీవి అంటేనే బాలకృష్ణకు గిట్టదన్నారు. సో ఇలా కథ చాలా మలుపులే తిరుగుతోంది. ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది.
తాజా ఎపిసోడ్ తో గౌరవం ఇచ్చి పుచ్చుకుంటానని చెప్పడం ద్వారా, తనను వైఎస్ జగన్ అవమానించలేదని చిరంజీవి స్పష్టం చేసినట్టైంది. అంతేకాదు, నాడు తన ఆధ్వర్యంలో జరిపిన చర్చల ఫలితంగానే సినిమా టికెట్ల ధరలు పెరిగాయని చిరంజీవి గుర్తు చేశారు. సో కథ అంతా మెగా-బాలకృష్ణ డైలాగ్ వార్ దిశగా కదులుతోంది. ఈ తుఫాన్ ఏ తీరాలకు చేరుతుందో చెప్పేలేని పరిస్థితి.
మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్
వైఎస్ జగన్ తో సినీ ఇండస్ట్రీ సమావేశంలో లేని ఇద్దరు మాట్లాడిన మాటలు ఇప్పుడు మెగా-నందమూరి మ్యాటర్ కు మరింత అగ్గి రాజేశాయి. నిజానికి ఆ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ ఉంది. అదిప్పుడు మరింతగా బయటపడింది. చిరంజీవి – బాలకృష్ణ మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు. ఇందుకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన సందర్భాలున్నాయ్. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి చిరంజీవి దూరంగా ఉన్నారు. ఈ టాక్ షో చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ భాగస్వామ్యం ఉన్న కంపెనీ నిర్వహిస్తోంది.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకూ దూరం
మరో ఎగ్జాంపుల్.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరయ్యారు తప్ప చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. మెగాస్టార్ చిరంజీవి ఇంట ఇప్పటివరకు ఎన్నో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం హాజరైనా బాలకృష్ణ మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సీన్ తో బేదాభిప్రాయాలు మరింతగా బయటపడ్డాయి. చిరంజీవి ఇచ్చిన స్టేట్ మెంట్ లో వ్యంగ్యంగా మాట్లాడారు అన్న పాయింట్ మెన్షన్ చేశారు. మిగితావంతా జాగ్రత్తగా డీల్ చేశారు. సో ఏకవచనంతో మాట్లాడడంతో కచ్చితంగా నొచ్చుకునే ఉండొచ్చు. దీన్ని మరింత రచ్చ చేయడం ఇష్టం లేక స్టేట్ మెంట్ తో సరిపెట్టారా.. లేక అమెరికా నుంచి వచ్చాక చిరంజీవి నుంచి ఏమైనా సంచలనాలు ఉంటాయా అన్నది తేలాల్సిన విషయం.
చిరంజీవి అభిమాన సంఘం నిరసన
బాలకృష్ణ బయట ఎక్కడో ఈ మాటలు మాట్లాడి ఉంటే ఇంతగా సీన్ ఘాటెక్కి ఉండకపోయేదంటున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే మాట్లాడడం, చిరంజీవి పేరు తీసుకుని ఏకవచనం వాడడంతోనే మ్యాటర్ హీటెక్కింది. తాజాగా చిరంజీవి అభిమాన సంఘం కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు తెలిపింది. అటు తిరుపతిలో వైసీపీ శ్రేణులు బాలకృష్ణకు వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. సో మ్యాటర్ మాత్రం ముదురుతోంది. నిజానికి బాలకృష్ణ పరిస్థితి ఏంటంటే.. అభిమానులపైనా గతంలో చేయి చేసుకుని రఫ్ఫాడించిన సందర్భాలున్నాయ్. వారిని కంట్రోల్ చేసే ఉద్దేశంలోనా మరొకటో గానీ.. గట్టిగానే చెంప చెళ్లుమనిపించారు. ఇలా రెండుమూడు సార్లు జరిగింది.
అఖండ కోసం అపాయింట్‌మెంట్ అడిగారన్న పేర్ని
చిరంజీవి జగన్ మీటింగ్ గురించి ఇంతలా మాట్లాడిన బాలృష్ణ.. నాటి సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అఖండ సినిమా కోసం కలవాలనుకోలేదా అని క్వశ్చన్ చేశారు. ఈ విషయాన్ని బాలకృష్ణ ఒట్టేసి చెబుతారా అని సవాల్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇదో కొత్త మ్యాటర్. అసలు జగన్ తో మీటింగ్ కోసం వెళ్లేందుకు ఫోన్ లోకే అందుబాటులోకి రాని బాలకృష్ణ అఖండ కోసం లైన్ లోకి వచ్చారన్న విషయాన్ని హైలెట్ చేశారు. గతంలోనూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు నాటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో భేటీ సందర్భంగా కూడా బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారా? చేయలేదు… వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి చర్చించుకుంటున్నారు. తననను సమావేశానికి పిలవలేదని మాట్లాడారు. అప్పుడు నాగబాబు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదంటూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే
బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఓ ప్రశ్నకు బాలయ్య జవాబు ఇచ్చారు. తనకు, చిరంజీవికి ఏమైనా విభేదాలు ఉన్నాయా అని అడిగితే.. తమకు ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రాలేదని, ప్రతి ఒక్కరూ తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నామన్నారు. 80, 90ల్లో బాలయ్య చిరంజీవికి టఫ్ కాంపిటీటర్. వాళ్లిద్దరి సినిమాలు 38సార్లు రిలీజ్ లో క్లాష్ అయ్యాయి. చిరంజీవి మూవీస్ 23సార్లు విజయం సాధించగా, బాలకృష్ణవి 11సార్లు హిట్ అయ్యాయి. 4సార్లు ఇద్దరి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సో వీరిద్దరూ రిస్పెక్ట్ చేసుకుంటారు. కానీ ఇండస్ట్రీ పోటీ, ఫ్యాన్ రైవల్రీ వల్ల కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. బాక్సాఫీస్ వార్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడే కాస్త డైరెక్ట్ వార్ కు దారి తీసింది. బాలకృష్ణ తనకు అవమానం జరిగిందని ఫీలవడం ద్వారానే ఈ సమస్య వచ్చింది. నిజానికి ఇలాంటి సమస్యలు వచ్చినా అప్పట్లో అంతర్గతంగా చర్చించుకున్నారు. బయటకు రాలేదు. కానీ ఇప్పుడు కథ మారింది. అంతే.
Story By Vidya Sagar, Bigtv