AP Assembly Coffee Issue: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో అంశంపై రగడ జరుగుతోంది. నిన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై మండలిలో గందరగోళం నెలకొంది. శనివారం ‘కాఫీ’ సరిగ్గా లేదని వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఈ విషయాన్ని మండలి ప్రతిపక్ష సభ్యుడు బొత్స సత్యనారాయణ స్వయంగా సభలో చెప్పారు. మండలి ఛైర్మన్ కు ప్రొటోకాల్ పాటించడంలేదని, కూటమి ప్రభుత్వం అవమానించిందని వైసీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో సభలో ఆందోళన చేస్తుండగా కాఫీ వివాదం తెరపైకి వచ్చింది.
మండలిలో ఎమ్మెల్సీలకు ఇచ్చే కాఫీకి, శాసనసభలో ఎమ్మెల్యేలకు ఇచ్చే కాఫీకి మధ్య చాలా తేడా ఉంటుందని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు అన్నారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ సభలో ప్రస్తావించారు. రెండు చోట్ల ఒకే రకమైన కాఫీ, భోజనాలు పెట్టడంలేదని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే ఈ వివాదంపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఎక్కడా ఎలాంటి తేడా లేదన్నారు.
ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిచేస్తామని పయ్యావుల హామీ ఇచ్చారు. మంత్రి వివరణకు శాంతించని వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో మండలి ఛైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు.
వైసీపీ ఎమ్మెల్సీలు, మండలి ఛైర్మన్ కు కనీస ప్రొటోకాల్ ఇవ్వడంలేదని సభ్యులు ఆందోళనపై మంత్రి పయ్యావుల ప్రకటన చేశారు. మండలి ఛైర్మన్ స్థానాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు.
ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ఇబ్బందులకు గురి చేయాలని ప్రభుత్వానికి లేదన్నారు. ఛైర్మన్ ప్రొటోకాల్ విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగితే పరిశీలిస్తామన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
శాసనమండలిలో వైసీపీ సభ్యుల కాఫీ వివాదంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. కాఫీ, టీల కోసం వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేయడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుంటా, విలువైన సభాసమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. మండలిలో కాఫీ, టీల కోసం వైసీపీ ఎమ్మెల్సీ దెబ్బలాడటం సిగ్గుచేటన్నారు. కాఫీ గొడవ వల్ల మండలిలో ప్రశ్నలే రాకుండా పోయాయన్నారు. ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న ఎస్టీలకు పట్టాలు ఇచ్చే విలువైన ప్రశ్నపై చర్చ జరగకుండా వైసీపీ కాఫీ గోలతో సభ వాయిదా పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ మొత్తం తనిఖీ చేశారని మంత్రి గుర్తుచేశారు. ఓ మహిళ సభ్యురాలి హ్యాండ్ బ్యాగ్ తనిఖీ చేయటం ప్రోటోకాలా? అని గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు.
Also Read: AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల మీద నిలదీస్తామని చెబుతున్న వైసీపీ, మండలిలో ప్రతిపక్ష హోదాలో జనం కోసం మాట్లాడకుండా కాఫీ, టీల కోసం సభను అడ్డుకుంటున్నారంటూ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. సభలో చర్చించడానికి ప్రజాసమస్యలే లేవా? అంటూ నెటిజన్లు నిట్టూరుస్తున్నారు.