Auto Driver Sevalo Scheme: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లోని మరో పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించారు. అక్టోబర్ 4న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదే రోజున ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేస్తామన్నారు.
‘ఆటోడ్రైవర్ల సేవలో’ పేరుతో ప్రతి ఏడాది రూ.15 వేలు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ 4న ప్రారంభించే ఈ పథకానికి 2,90,234 మందిని లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. ఏదైనా కారణంతో అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే వారి సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో స్కీమ్ కు రూ.435 కోట్ల ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు.
గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు మాత్రమే ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నామని చెప్పారు.
‘దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం. ఏపీలో ఏడాదికి రూ.32,143 కోట్లు పెన్షన్ల నిమిత్తం కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు, కేరళ రూ.7295 కోట్లు పెన్షన్లు కింద ఖర్చు పెడుతున్నాయి. అంటే పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టే దాంట్లో పావు వంతు ఖర్చు పెడుతున్నాయి’ – సీఎం చంద్రబాబు
దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనన్ని పింఛన్లను కూటమి సర్కారు ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు పింఛన్లు ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో తొలిరోజునే 97 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయిస్తుందన్నారు. నెలకు రూ.2,745 కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తంగా 63.50 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వారిలో 59 శాతం మంది మహిళలు ఉన్నారన్నారు.
తల్లికి వందనం పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ. 10,090.74 కోట్లను తల్లికి వందనం పథకానికి ఖర్చు పెట్టామన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేశామని తెలిపారు. ఇప్పటికీ తల్లికి వందనం పథకం అందని వారు ఉంటే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.
దీపం-2.0 పథకం సమర్థవంతంగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీపం-2.0 పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 2.66 కోట్ల ఉచిత సిలిండర్లు మహిళలకు అందచేశామని స్పష్టం చేశారు. ఈ పథకానికి రూ.1718 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు.
Also Read: AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?
ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి అక్టోబర్ 4న ప్రారంభించనున్నారు. లబ్దిదారుల జాబితాలు ఇప్పటికే సిద్ధం చేశారు. జాబితాలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి లాగిన్ అవసరం లేదు
ఆటో డ్రైవర్ ఆధార్ నెంబర్ తో https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ఈ వెబ్ సైట్ లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.