Karur stampede updates: టీవీకే పార్టీ ర్యాలీలో ఏం జరిగింది? కరూర్ తొక్కిసలాట ఘటన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయా? తొక్కిసలాట జరగవచ్చని వారం కిందట సోషల్ మీడియాలో పోస్టులు హంగామా చేశాయా? ఈ ఘటనపై అధికార డీఎంకె ఏ విధంగా అడుగులు చేయనుంది? టీవీకే పార్టీ అధినేత విజయ్‌ను అరెస్టు చేశారా? దీనిపై తమిళనాట రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
దక్షిణ తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కసలాట ఘటనపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల కిందట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ అయ్యాయి. టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాట ఘటన జరుగుతుందని ఆ పోస్టు సారాంశం. ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయా అనేదానిపై అక్కడి ప్రజలు తలో విధంగా చర్చించుకుంటున్నారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 39 మంది మరణించారు. ఆ సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కేవలం అరగంటలో పెను విషాదాన్ని మిగిల్చింది. గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆదివారం ఉదయం చెన్నై నుంచి కరూర్ వెళ్లారు సీఎం స్టాలిన్.
ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం ఎంకే స్టాలిన్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ALSO READ: ఇండియాకు ట్రంప్ మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు
తొక్కిసలాట ఘటనకు అసలు కారణం వెల్లడించారు తమిళనాడు డీజీపీ. ర్యాలీకి కేవలం 10 వేల మందికి మాత్రమే అనుమతి ఉంది. దాదాపు 30 వేల నుంచి 60 వేలు మందికిపైగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం టీవీకే అధినేత విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని ప్రకటించినా, దాదాపు 6 గంటలు ఆలస్యంగా రావడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై స్టాలిన్ సర్కార్ ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు రిటైర్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరగనుంది. విచారణలో నిజాలు బయటకు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోనుంది.
ఈ ఘటనపై ఎక్స్ వేదికగా విజయ్ రియాక్ట్ అయ్యారు. ‘‘నా హృదయం ముక్కలైంది.. చెప్పలేని భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంతో నేను విలవిలలాడుతున్నా. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.
మరోవైపు టీవీకె అధినేత విజయ్‌ని అరెస్టు చేయడం ఖాయమనే ప్రచారంలో అప్పుడే మొదలైంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే దక్షిణ తమిళనాడు అన్నాడీఎంకేకి కంచుకోట. ఆ కోటను బద్దలు కొడితే గెలవడం ఈజీ అవుతుందని రాజకీయ నేతల ఆలోచన. ఆ నేపథ్యంలో విజయ్ అక్కడ భారీ ర్యాలీ చేపట్టారని అంటున్నారు.
ఈ ఘటనలో విజయ్‌ని అరెస్టు చేస్తే సానుభూతి పవనాలు అనుకూలంగా వీస్తాయని, ఆ పార్టీ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశముందని అంటున్నారు నేతలు. ఎందుకంటే అన్నాడీఎంకెకు జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పళనిస్వామి మీద ఆ పార్టీ ఆశలు పెంచుకుంది. ఈలోగా విజయ్ ఎంట్రీ ఇవ్వడంతో అన్నాడీఎంకే నేతల అంచనాలు మారుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి కరూర్ ఘటన ఎవర్ని ముంచుతుందో? ఎవర్ని పీఠం ఎక్కిస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కరూర్ ఘటనపై విచారం వ్యక్తం చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కరూర్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటన
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ pic.twitter.com/IWKklU8pUU
— BIG TV Breaking News (@bigtvtelugu) September 28, 2025