GST Official Suspended: సోషల్ మీడియా యుగంలో ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతుంది. వీటిల్లో నూటికి పది శాతం మాత్రమే వాస్తవాలు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. అవాస్తవాలు, ఎక్కడో జరిగిన వాటిని ముడిపెడుతూ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్న ఘటనలు చూస్తు్న్నాం. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అలాంటి ఓ పోస్టు పెట్టి ఉద్యోగం కోల్పోయారు ఏపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి.
ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వినియోగంలో అలర్ట్ గా ఉండాలి. లేదంటే ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి రావచ్చు. తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆయన చేసిన ఓ పోస్ట్ తన ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ముగిందంటూ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టులు పెట్టారు. అమరావతిలోని శాఖమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెంలో సీఆర్‌డీఏ రిజర్వాయర్లు నిర్మించనుందంటూ వచ్చిన ఓ వార్తను ట్యాగ్ చేస్తూ.. సుభాష్ ఈ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో అమరావతి కోసం మూడు రిజర్వాయర్లెందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌లా మార్చేస్తే సరిపోతుంది. ఏడాదికి మూడు పంటలు పండే నేల, రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉండదా? అని వ్యంగ్యంగా పోస్టు పెట్టారు.
దీంతో పాటు ‘ఒకే ఒక్క వర్షం, అమరావతి జలమయం’ అంటూ మరో పోస్ట్ కూడా పెట్టారు సుభాష్. అమరావతి నీట మునిగిపోయిందని నమ్మించేందుకు నీరుకొండ -పెదపరిమి మధ్య నీట మునిగిన పంట పొలాల ఫొటోను ఆయన షేర్ చేశారు. అమరావతిపై విద్వేషం పెంచేలా వ్యాఖ్యలు, పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదుతో ప్రభుత్వం విచారణకు ఆదేశంచింది. విచారణలో సుభాష్ ఉద్దేశపూర్వకంగానే ఈ పోస్టులు పెట్టారని తేలడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సుభాష్ చంద్రబోస్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన వైఎస్ జగన్ ను అభిమానిస్తారని, వైసీపీ అనుకూల మీడియాలో వచ్చిన ఫొటోలు, కథనాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారని తెలుస్తోంది. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తన సోషల్ మీడియాలో పోస్టులకు కట్టుబడి ఉన్నట్లు సుభాష్ సంజాయిషీ ఇవ్వడంతో.. ఆయనను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆగస్టు 18న ఆయన అమరావతిపై ఈ పోస్టు పెట్టారు. సుమారు నెల రోజుల పాటు విచారణ జరిపి, క్రమశిక్షణ ఉల్లంఘన కింద సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి
ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు అమరావతి పరిసరాల్లో వాగులు ఉప్పొంగాయి. తాడికొండ మండలంలోని పంట పొలాల్లో కొంతమేర నీరు చేరింది. భారీ వర్షంతో పంట పొలాలు మునుగుతాయిని, రెండు మూడు రోజులకు ఆ నీరు తగ్గిపోతుందని స్థానిక రైతులు చెబుతున్నారు. అయితే అమరావతిని వ్యతిరేకిస్తున్న ఓ వర్గం నేతలు అమరావతిపై తప్పు ప్రచారం చేస్తుంటారని స్థానికులు అంటున్నారు. వేరే చోట జరిగిన సంఘటనలను అమరావతికి ముడిపెడుతూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.