Sammakka-Saralamma: మేడారంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వనదేవతలైన సమ్మక్క – సారక్కలకు సీఎం రేవంత్ మొక్కులు చెల్లించారు. అనంతరం సీఎం మీడియాతో ప్రసంగించారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలే కాదని.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని అన్నారు. ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇచ్చామని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా 22వేల ఇళ్లు ఇచ్చామని పేర్కొన్నారు.
సమ్మక్క- సారక్క గద్దెల, ప్రాంగణ అభివృద్ధి నిర్మాణం జీవితంలో వచ్చిన గొప్ప అవకాశమని అన్నారు. ‘ప్రతి మనిషి జన్మిస్తాడు.. మరణిస్తాడు.. కానీ కొంతమందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి. ఈ రోజు సమ్మక్క సారలమ్మ గద్దెల, ప్రాంగన అభివృద్ధి నిర్మాణం మా సీతక్కకు, నాకు ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం. సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది. ఒక్కసారిగా గుట్టల పై నుంచి గద్దెల పైకి అమ్మవార్లను కూర్చోబెడితే సరిపోతుందని అనుకుంది.. అనుకున్నట్టే సీతక్క చేతి నుంచి అన్ని పనులు అవుతున్నాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్
గతంలో లేనట్టుగా దళితులకు, గిరిజనులకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత కల్పించాం. సమ్మక్క సారలమ్మ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం. సమ్మక్క సారలమ్మ ప్రాంగణ పునర్ నిర్మాణంలో ఆదివాసీలను భాగస్వామ్యులను చేస్తున్నాం. రాతి కట్టడాలతో కడితే వందల, వేల ఏళ్లు ఉంటుంది. రుద్రదేవుడు రాతి కట్టడాలతో రామప్పను కట్టారు. రాతి నిర్మాణాలతో వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. రాత్రి కూడా ఇక్కడ పనులు జరగాలి.. దీనికి స్థానిక ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి’ అని సీఎం పేర్కొన్నారు.
ప్రతి వారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం రావాల్సిందే.. ఇంచార్జ్ మంత్రిగా పనులను పర్యవేక్షించాల్సిందే.. సమ్మక్క – సారలమ్మ మాల వేసుకున్నట్టుగా.. నిష్టతో పనులు చేయాలి. కుంభమేళాకు కేంద్రం వేల కోట్లు ఇస్తుంది. మా ఆదివాసీ పండుగను జాతీయ పండుగగా ఎందుకు గుర్తించడం లేదు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించాలి. అయోధ్య ఒక్కటే దేవాలయం కాదు. మీరు నిధులు ఇవ్వకపోతే మీ ఇష్టం. నేను ఏం అనను.. కానీ సమ్మక్క సారలమ్మ అన్ని గమనిస్తున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.