Tirupati Laddu Controversy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అజయ్‌కుమార్ సుగంధ్‌ను సిట్ అరెస్టు చేసింది. ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. నవంబర్ 21 వరకు రిమాండ్ విధించింది.
సిట్ దర్యాప్తులో.. అజయ్‌కుమార్ సుగంధ్ గత ఏడు సంవత్సరాలుగా బోలే బాబా కంపెనీకి మోన్ గ్రీజరాయిడ్స్, అసటిక్ యాసిడ్ యాస్టర్ వంటి కెమికల్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ఈ కెమికల్స్‌ను పామాయిల్ తయారీ ప్రక్రియలో వాడుతూ, ఆ పామాయిల్‌ను లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిగా సరఫరా చేసినట్టు విచారణలో వెల్లడైంది.
సిట్ అధికారులు తెలిపిన ప్రకారం.. లడ్డూలలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతానికి పైగా పామాయిల్ కల్తీ ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
సిట్ ఇప్పటికే బోలే బాబా కంపెనీ యజమాని, మేనేజ్‌మెంట్ సిబ్బందితో పాటు పలు సరఫరాదారులను విచారించింది. నెయ్యి సరఫరా వ్యవస్థలో అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యమైన డెయిరీ నెయ్యి బదులుగా చౌక పామాయిల్ కలిపిన కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా కోట్ల రూపాయల మోసం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
దర్యాప్తు బృందం ఇప్పటికే బోలే బాబా కంపెనీ గోదాములు, రసాయనాల నిల్వ కేంద్రాలు, సరఫరా రికార్డులను పరిశీలించింది. ఆ రికార్డుల ద్వారా అజయ్‌కుమార్ సుగంధ్ పామాయిల్ ఉత్పత్తికి అవసరమైన కెమికల్స్‌ను విస్తృత స్థాయిలో అందజేశారని నిర్ధారించారు. విచారణలో ఆయన వందల లీటర్ల రసాయనాలను సరఫరా చేసినట్లు అంగీకరించినట్టు సమాచారం.
సిట్ అధికారులు పేర్కొన్నట్లుగా, ఈ కల్తీ చర్యలు కేవలం ఆర్థిక మోసం మాత్రమే కాకుండా.. భక్తుల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని తెలిపారు. మోన్ గ్రీజరాయిడ్స్, అసటిక్ యాసిడ్ యాస్టర్ వంటి కెమికల్స్ అధిక మోతాదులో వాడితే లివర్, హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..
ఇక సిట్ దృష్టి ఇప్పుడు ఈ కల్తీ వ్యవస్థ వెనుక ఉన్న పెద్ద వ్యాపార వలయంపై కేంద్రీకృతమవుతోంది. అజయ్‌కుమార్ ఇచ్చిన వివరాల ఆధారంగా మరికొన్ని కంపెనీలు, మధ్యవర్తులు, రసాయన సరఫరాదారులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సమాచారం.