MSK Prasad: బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రొటోకాల్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గన్నవరం ఎయిర్ పోర్టు ఘటనపై ఎమ్మెస్కే ప్రసాద్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రొటోకాల్ వివాదంపై టీడీపీ ఎంపీ, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సానా సతీష్ సీఎం సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఏసీఏకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ప్రోటోకాల్ వ్యవహారంపై ఎమ్మెస్కే ప్రసాద్.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులపై ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏసీఏ ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా తనను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారని ఎమ్మెస్కే ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ఘటనపై ఎమ్మెస్కే ప్రసాద్ బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తారని వార్తలు రాగా.. సీఎం చంద్రబాబు ఈ వివాదంపై వెంటనే స్పందించారు. వీఐపీల విషయంలో ఏసీఏ అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు అనుకోని సంఘటన ఎదురైంది. మహిళా వరల్డ్ ప్రపంచకప్ విన్నర్, తెలుగు తేజం శ్రీచరణికి ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎమ్మెస్కే ప్రసాద్ వచ్చారు. అయితే క్రికెటర్లు ఉన్న లాంజ్ లోకి ఎమ్మెస్కే ప్రసాద్ ను సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. ఈ వ్యవహారంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెస్కే ప్రసాద్ వెంటనే విషయాన్ని ఎస్పీ వరకూ తీసుకెళ్లారు. మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్‌గా పనిచేసిన తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై ఎమ్మెస్కే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారత స్పిన్నర్ శ్రీచరణి శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సమయంలో శ్రీచరణికి ఘనస్వాగతం పలికేందుకు పలువురు ప్రముఖులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారిలో మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ అధికారులు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెస్కే ప్రసాద్ కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. భద్రతా కారణాలను చూపుతూ ఎయిర్‌పోర్టు అధికారులు ఎమ్మెస్కే ప్రసాద్‌ను శ్రీచరణి ఉన్న లాంజ్‌లోకి అనుమతించలేదు. తనకు ప్రొటోకాల్ పాటించాల్సిందేనని ఎమ్మెస్కే ఎయిర్‌పోర్టు అధికారులకు స్పష్టం చేశారు. ప్రోటోకాల్ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేయగా, ఎస్పీ వెంటనే స్పందించారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ను శ్రీచరణి ఉన్న లాంజ్‌లోకి అనుమతించారు.
Also Read: Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా 2009 నుంచి 2014 వరకు ఎమ్మెస్కే ప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో క్రికెటర్లకు అనేక మౌళిక వసతులు కల్పించారు. ఏసీఏ క్రికెట్ అకాడమీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మైదానాల అభివృద్ధికి కృషి చేశారు. ఎమ్మెస్కే పనితీరు చూసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి ఇచ్చింది. తన పనితీరుతో ఏపీకి పేరు తెచ్చిన ఎమ్మెస్కే లాంటి ఆటగాడిని సెక్యూరిటీ అడ్డుకోవడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ 1999-2000 మధ్య టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు, 17 వన్డేలు ఆడారు. అలాగే 2016 నుంచి 2019 వరకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా పని చేశారు.