CM Chandrababu: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో, 26 పరిశ్రమలకు చెందిన రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు, తద్వారా 85,870 ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఇప్పటివరకు జరిగిన 12 సమావేశాల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలు దక్కనున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించడమే కాకుండా అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా (గ్రౌండ్ అయ్యేలా) అధికారులు బాధ్యత తీసుకోవాలని గట్టిగా ఆదేశించారు. పెట్టుబడిదారులకు భూమి, విద్యుత్ వంటి వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం జరగరాదని, ఫిర్యాదులకు తావివ్వవద్దని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు పొంది కూడా పనులు ప్రారంభించని ప్రాజెక్టులను సమీక్షించి, పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు.
Read Also: Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్
రాష్ట్రంలో క్లస్టర్ వారీ విధానంలో 15 పారిశ్రామిక జోన్లను అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పార్క్, చిప్, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మూడు మెగా సిటీలను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను, అలాగే అమరావతి, తిరుపతిని మెగా సిటీలుగా తీర్చిదిద్దాలని, వీటికి సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని చెప్పారు. ఈ నగరాలను టూరిజం, ఐటీ, పారిశ్రామిక హబ్‌లుగా, నివాసయోగ్యమైన టౌన్‌షిప్‌లతో అనుసంధానించాలని అన్నారు.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించాలని, ఆ సదస్సు కంటే ముందే తాజాగా ఆమోదం పొందిన పరిశ్రమలకు శంకుస్థాపనలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొంటామన్నారు. ఆమోదం పొందిన వాటిలో AMG మెటల్స్ (రూ. 44,000 కోట్లు), ఇండిచిప్ సెమీ కండక్టర్స్ (రూ. 22,976 కోట్లు), వాసాంగ్ ఎంటర్‌ప్రైజ్ (17,645 ఉద్యోగాలు), విశాఖ రియాల్టీ (30 వేల ఉద్యోగాలు) వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.