Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన వి. కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం కేసులో.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండవ నిందితుడిగా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది సజీవదహనమై మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో.. చెట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి-44 పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ఆ సమయంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి.. క్షణాల్లోనే మొత్తం మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సు లోపల నిద్రిస్తున్న ప్రయాణికుల్లో 19 మంది సజీవహనం అయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో బస్సులో సేఫ్టీ ఎగ్జిట్ డోర్లు లేకపోవడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవడం వంటి నిర్లక్ష్యాలు బయటపడ్డాయి.
ఘటన అనంతరం కర్నూలు జిల్లా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బస్సు డ్రైవర్, యజమాని, మేనేజర్‌లపై IPC సెక్షన్ 304-A తోపాటు.. పలు కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో, ప్రమాదానికి కారణమైన బస్సు అనుమతించిన రూట్, టెక్నికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా నడిపినట్లు, బస్సు మోటార్ ఫిట్‌నెస్ కూడా గడువు ముగిసినదని పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మిరియాల లక్ష్మయ్య (బస్సు డ్రైవర్)ను పోలీసులు.. గత నెల అక్టోబర్ 28న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.
కేసులో రెండవ ముద్దాయిగా ఉన్న వి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్.. గత కొన్ని వారాలుగా పరారీలో ఉన్నాడు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో శోధించారు. చివరికి ఆధారాలు సేకరించి, ఈరోజు (2025 నవంబర్ 7) ఉదయం 7.30 గంటలకు కర్నూలులో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను JFCM స్పెషల్ మొబైల్ కోర్టు ఎదుట హాజరు పరచగా, కోర్టు ఆయనను రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.
Also Read: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా
ప్రయాణికుల భద్రతను నిర్లక్ష్యం చేసిన ట్రావెల్స్ యాజమాన్యం, రవాణా శాఖ అధికారులు కూడా పరిశీలనలో ఉన్నారు. ఫిట్‌నెస్ లేకుండా బస్సు నడపడానికి అనుమతి ఎలా లభించింది? ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.