AP Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో వాయుగుండం కదిలిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం రాత్రి లేదా రేపు ఉదయం గోపాల్‌పూర్‌కు దగ్గరగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందన్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ఉదయం 8.30 గంటలకు తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం అధికారి సీహెచ్ నాగభూషణం తెలిపారు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తోందన్నారు. విశాఖకు దక్షిణ-ఆగ్నేయ దిశలో ఇది కేంద్రీకృతమైందని తెలిపారు.
‘గురువారం రాత్రి లేదా రేపు ఉదయం పారాదీప్–గోపాలపూర్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లకూడదు. తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉంది’ అని సీహెచ్ నాగభూషణం తెలిపారు.
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ఆస్కారం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-75 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రయాణాలు మానుకోవాలని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం APSDMA టోల్ ఫ్రీ నెంబర్లు112,1070, 18004250101 సంప్రదించాలన్నారు.
‘వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కృష్ణా నది ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద 3.76 లక్షల క్యూసెక్కులు, గోదావరి నది ప్రవాహం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10.82 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదీపరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించారు.