Visakha Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఉత్తరాంధ్రలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి గాలులు తోడయ్యాయి. బలమై ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో విశాఖ సిటీలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.
ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు
రెండురోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. దీని కారణంగా ఏపీ, ఒడిషాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నా యి. వర్షాలకు తోడు బలమైన ఈదురు గాలులు తోడయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ చెట్లు కూలిపోతున్నాయి.
బుధవారం అర్థరాత్రి నుంచి ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ చెట్టు నేలకూలింది. ఆ ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేస్తూ ఉంటారు. టూ వీలర్స్, కార్లపై చెట్టు విరిగిపడింది. అలాగే ఆకాశవాణి కేంద్రం వద్ద మరో చెట్టు కూలినట్టు తెలుస్తోంది.
ఈదురు గాలులకు విరిగిన చెట్లు
అక్కయ్యపాలెంలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో కారుపై రావి చెట్టు కూలింది. దీని కారణంగా ఓ ఇంటి గోడ పూర్తి కూలిపోయింది. కళింగ నగర్ ప్రధాన రహదారిలో పార్క్ చేసిన కారుపై చెట్టు కూలింది. కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. ఓ వైపు వాటర్, ఇంకోవైపు చెట్లు విరడంతో వాహానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో నగరంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ALSO READ: రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం, భారీ ఏర్పాట్లు
ప్రస్తుతం వాయుగుండం.. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం ఒడిషాలోని గోపాల్‌పూర్-పరదీప్‌తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశముంది.
వాయుగుండం కళింగపట్నానికి తూర్పున 170 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి తూర్పు-ఈశాన్యంగా దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది వాయుగుండం. వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
వాతావరణ శాఖ వార్నింగ్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల-7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది.
గాదిరాయి- 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు-3.8, శ్రీకాకుళం జిల్లా పలాస-3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. రానున్న రెండురోజుల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విశాఖలో ఈదురు గాలుల బీభత్సం. నగరంలో పలు చోట్ల విరిగిపడ్డ చెట్లు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews pic.twitter.com/FTZLQVtOYl
— Vizag News Man (@VizagNewsman) October 2, 2025