BigTV English

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఒకటో తేదీన పింఛన్ల పంపిణీతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పండుగను అమలు చేస్తున్నామని తెలిపారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతి నియోజకవర్గం దత్తి గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు, ఆయన తల్లికి పింఛన్ అందజేశారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఒకప్పుడు పండుగ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ప్రతి నెలా పండుగ వస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత నేటితో కలిపి 16 నెలల్లో రూ.48,019 కోట్లు పింఛన్లపై ఖర్చు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50,765 మందికి రూ.2,745 కోట్లు పింఛన్లు కింద పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

‘వృద్ధాప్య పింఛనుదారు చనిపోతే అతని భార్యకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేస్తున్నాం. ఈ నెలలో కొత్తగా 10,578 మందికి రూ.4.23 కోట్లు వితంతు పింఛన్లు ఇస్తున్నాం. 2 నెలలు పెన్షన్ తీసుకోని 1,34,023 మందికి రూ.108 కోట్లు, 3 నెలలుగా పింఛన్లు తీసుకోని 11,545 మందికి రూ.14 కోట్లు విడుదల చేశాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.


పేదలకు న్యాయం చేయడమే లక్ష్యం

గత ప్రభుత్వంలో ఒకటి రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్లని, కూటమి ప్రభుత్వంలో పేదలకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఇస్తున్నామని సీఎం తెలిపారు. ‘లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పింఛన్ అందిస్తున్నాం. ఒక్క విజయనగరం జిల్లాలోనే ప్రతీ నెలా 2,75,682 మందికి రూ.117 కోట్లు పింఛన్లు రూపంలో ఇస్తున్నాం. ఎన్టీఆర్ 1985లో రూ. 30తో పింఛను పథకాన్ని ప్రారంభించారు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని రూ. 75 చేశాను. 2014లో రూ. 1000 , ఆపై 2000 వేలకు పెంచాము’ అని ముఖ్యమంత్రి అన్నారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట

సూపర్ సిక్స్ పథకాల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.10,090 కోట్లు 63.77 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశామన్నారు. ఆడబిడ్డలకు వంటింటి కష్టాలు తీర్చాలని దీపం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించారు.

స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభిస్తే 45 రోజుల్లోనే దగ్గర దగ్గరగా మహిళలు10 కోట్ల ప్రయాణాలు చేశారన్నారు. ఈ పండుగ సీజన్ లో అన్ని దేవాలయాల్లో మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. పథకం అమల్లో భాగంగా నెలకు రూ.247 కోట్లు, ఏడాదికి రూ.2,963 కోట్లు స్త్రీ శక్తి కోసం ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో

డ్రైవర్ల కష్టాలు తనకు తెలుసు కాబట్టే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకం తెస్తున్నామని సీఎం అన్నారు. ‘ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఈ నెల 4న ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం ఇస్తాం. దాదాపు 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా గుర్తించాం. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ.435 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని సీఎం తెలిపారు.

‘పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ఒక్కో రైతుకూ రూ.20,000 ఇస్తున్నాం. సూపర్ సిక్స్ లో మొదటి హామీ మెగా డీఎస్సీ . ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెట్టి ఏడాదికే టీచరు పోస్టులు ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు నేను అండగా ఉంటాను. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093 మందిని, పోలీస్ శాఖలో 6,100 ఉద్యోగాలు భర్తీ చేశాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇప్పటికే 5,500 మందికి ఉపాధి కలుగుతోంది. ఈ 15 నెలల్లో ఇప్పటివరకు మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశాం’ అని సీఎం తెలిపారు.

2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు

2029 నాటికల్లా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, వచ్చే ఏడాది జూన్ కల్లా మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అందరి ఆకలి తీర్చేలా 204 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. యూనివర్సల్ హెల్త్ పాలసీ త్వరలో తీసుకువస్తున్నామన్నారు. పేదలు, ధనికులు తేడా లేకుండా అందరికీ రూ.2.5 లక్షలు మేర ఆరోగ్య బీమా అందిస్తామన్నారు. దీంతో రాష్ట్రంలోని 1.63 కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుందని చెప్పారు.

‘పేదలకు రూ 25 లక్షల వరకూ ఉచితంగానే వైద్యం అందిస్తాం. జీఎస్టీ వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడేలా ధరలు తగ్గి కొనుగోలు శక్తి పెరిగింది. జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దాదాపు రూ.8 వేల కోట్లు తగ్గుతుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది. కొత్త శ్లాబుల వల్ల ప్రతి కుటుంబానికి…ప్రతినెలా రూ.1000 -1500 వరకు ఆదా అవుతుంది’ అని సీఎం అన్నారు.

Also Read: Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

కరెంటు ఛార్జీలు పెంచం

ఎన్డీఏ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గించే చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. సమర్ధ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు రేట్లు పెంచి రూ. 32 వేల కోట్ల భారం ప్రజలపై వేశారు. దేశ చరిత్రలో తొలి సారి ట్రూడౌన్ తో విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నామన్నారు. నవంబర్ 13 నుంచి ట్రూ అప్ ఛార్జీలు యూనిట్ కు 13 పైసలు తగ్గుతాయన్నారు.

Related News

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

Big Stories

×