దాదాపు 3 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం..
ఒక కేసులో బెయిలొచ్చినా, మరో కేసులో జైలు..
6 కేసులు, ఐదు బెయిళ్లు.. ఈరోజు మరో కేసులో బెయిల్ పై తీర్పు
ఇదీ క్లుప్తంగా వల్లభనేని వంశీ ట్రాక్ రికార్డ్. పోసాని, బోరుగడ్డ లాంటి చాలామంది బెయిల్ పై బయటకొచ్చినా.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం జైలునుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎస్సీ,ఎస్టీ కేసులో ఇటీవల ఆయనకు బెయిలొచ్చినా, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు. ఈరోజు ఆఫీస్ పై దాడి కేసులో బెయిల్ పై తుది తీర్పు రావాల్సి ఉంది. పోనీ ఈరోజు కోర్టు బెయిలిచ్చినా నకిలీ ఇళ్ల పట్టాల కేసు రెడీగా ఉంది. దీంట్లో ఆల్రడీ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. అంటే.. ఇవాళ బెయిలొచ్చినా.. ఆయన్ను తిరిగి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఆ కేసులో బెయిల్.. మరి ఈ కేసులో..
వల్లభనేని వంశీపై ఆరు కేసులున్నాయి. అందులో ప్రధానమైనది టీడీపీ ఆఫీస్ పై దాడి. ఈ దాడి కేసు నుంచి తప్పించుకోడానికి, కేసు పెట్టిన సత్యవర్ధన్ అనే వ్యక్తినే కిడ్నాప్ చేయించడంతో మరో కేసు నమోదైంది. అయితే ఇది ఎస్సీ, ఎస్టీ కేసు కావడం విశేషం. ఈ కేసులో సుదీర్ఘ కాలం వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈనెల 13న ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కూడా ఆయనకు రిమాండ్ ఉంది. దీంతో ఆ కేసులో బెయిలొచ్చినా, ఈ కేసులో బెయిల్ రాలేదు కాబట్టి ఆయన బయటకు రాలేకపోయారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఈరోజు న్యాయస్థానం వంశీ బెయిల్ పై తుదితీర్పు ఇవ్వాల్సి ఉంది. ఈ తీర్పు ఎలా ఉన్నా.. ఆయన్ను మళ్లీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
అప్పుడు చేసిన తప్పు..
తాజాగా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటున్న కేసు వైసీపీ హయాంలో నమోదైనది కావడం విశేషం. 2019లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసి వల్లభనేని వంశీ గెలిచారు. అప్పుడు వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ చేసిన ఓ తప్పు బాగా హైలైట్ అయింది. ఎలక్షన్ టైమ్ లో తహశీల్దార్ స్టాంప్ లు, సంతకాలు ఫోర్జరీ చేసి కొంతమంది పేదలకు వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలు ఇచ్చారనేది అభియోగం. బాపులపాడు మండలంలో కొందరికి వంశీ ఇలా పట్టాలిచ్చారు. ఈ నకిలీ పట్టాల వ్యవహారంపై వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండటంతో వ్యవహారం చకచకా ముందుకు కదిలింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి వంశీపై కేసు నమోదు చేశారు. వంశీ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదైంది. ఆయన్ను పదో నిందితుడుగా చేర్చారు.
అటు.. ఇటు..
కాలక్రమంలో వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో ఈ కేసు మరుగున పడిపోయింది. ఇక 2024 ఎన్నికల్లో అప్పటి ప్రత్యర్థులు పార్టీలు మారి మళ్లీ ప్రత్యర్థులుగా మారారు. ఈసారి వైసీపీ టికెట్ పై పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. టీడీపీ టికెట్ పై యార్లగడ్డ గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఆ కేసు తెరపైకి వచ్చింది. పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్ ని అనుమతిస్తూ.. ఆయన్ను ఈనెల 19వతేదీలోగా కోర్టులో హాజరు పరచాలంటూ.. ఏలూరు జిల్లా నూజివీడులోని రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. దీంతో వంశీ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్టయింది.
కిడ్నాప్ కేసులో బెయిలొచ్చింది కానీ ఫలితం లేదు. ఈరోజు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో బెయిలొచ్చినా ఫలితం కనిపించేలా లేదు. మొత్తంగా వల్లభనేని వంశీని వరుస కేసులు చుట్టుముడుతున్నాయి. మూడు నెలలుగా ఆయన జైలులోనే కాలం గడుపుతున్నారు. ఆరోగ్యం బాగోలేదని, కనికరం చూపాలని వంశీ భార్య వేడుకుంటున్నారు. మరి ఈరోజు బెయిల్ పై తుది తీర్పు ఎలా వస్తుంది, పీటీ వారెంట్ తో వంశీని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేస్తారా..? వేచి చూడాలి.