Delhi- Kashmir Train: కాశ్మీర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అద్భత క్షణం రానేవచ్చింది. ఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్ కు రైలు రావాలనే కల నెరవేరింది. తొలిసారిగా భద్రతా బలగాలతో ఢిల్లీ నుంచి ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా (USBRL) రైల్వే లింక్ ద్వారా శ్రీనగర్ చేరుకుంది. ఈ రైలులో సుమారు 800 మంది భద్రతా సిబ్బంది శ్రీనగర్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. ఈ ప్రత్యేక రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనతో పాటు దేశంలోనే తొలి కేబుల్ స్టే బ్రిడ్జ్ ను దాటుకుని ముందుకుసాగింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ రైలు తన గమ్య స్థానానికి చేరుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
అమర్ నాథ్ యాత్ర సెక్యూరిటీ కోసం బలగాల తరలింపు
జూలై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర కోసం కాశ్మీర్ లోయలో భద్రతా దళాలను కేంద్రం భారీగా మోహరిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ ఎదురు దాడి నేపథ్యంలో ఇండో, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా కాశ్మీర్ లోయలో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరిస్తోంది. అమర్ నాథ్ యాత్రకు సెక్యూరిటీ కల్పించేందుకు గాను, ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు భద్రతా బలగాలను ప్రత్యేక రైలులో తరలించారు. ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ రైలు ఉదయం 8 గంటలకు జమ్మూలోని కత్రా రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడి నుంచి శ్రీనగర్ కు రైలు బయలుదేరింది. 10 గంటల సమయంలో ఈ రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన మీదుగా ప్రయాణం సాగించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీనగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.
చీనాబ్ రైల్వే వంతెన గురించి..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చీనాబ్ రైల్వే వంతెన గుర్తింపు తెచ్చుకుంది. ఈ వంతెనను జమ్మూ డివిజన్ లోని రియాసి జిల్లా బక్కల్- కౌరి మధ్య చీనాబ్ నదిపై నిర్మించబడింది. కాశ్మీర్ ను దేశంలోని అన్ని ప్రాంతాలతో కనెక్ట్ చేయడానికి గాను USBRL రైల్వే లైన్ ను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. 359 మీటర్ల ఎత్తుతో ఈ రైల్వే బ్రిడ్జి ఉంటుంది. ఇది పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది. 1.3 కిలోమీటర్ల పొడవైన వంతెనను రూ. 1,486 కోట్లతో నిర్మించారు. USBRL ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెన నిర్మాణ పనులు 2004లో ప్రారంభమయ్యాయి. ఆర్చ్ 2021లో పూర్తయియ్యింది. మొత్తం నిర్మాణం 2022లో పూర్తయ్యింది. ఈ వంతెన సుమారు 120 ఏండ్లు సేవలు అందించేలా రూపొందించారు. రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రత వరకు భూకంపాలను తట్టుకుంటుంది. ఈ వంతెనపై ట్రయల్ రన్ జూన్ 2024లో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ మార్గంలో రైలు సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
Read Also: హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, ఏ ప్రాంతలకు వెళ్తాయంటే?