Big Stories

CM Jagan: జగన్ నాలుగేళ్ల పాలనపై విమర్శలివే..

cm jagan

CM Jagan mohan reddy news(Political news in AP): టార్గెట్ 175 ఇదీ జగన్ తమ పార్టీ శ్రేణులకు చెబుతున్న మాట. మరి ఇచ్చిన హామీలు అమలయ్యాయా? జగన్ పాలన జనరంజకంగా ఉందా? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అధికార పక్షం ఏం చెబుతోంది? ఈ ఒక్కసారి కష్టపడితే చాలు.. 30 ఏళ్లు వెనుదిరిగి చూసుకోనక్కర్లేదంటున్నారు జగన్. మరోవైపు ప్రజావేదిక కూల్చేసి అశుభంతో పని మొదలు పెట్టారని టీడీపీ అంటోంది. నాలుగేళ్ల జగన్ పాలన అఫ్గాన్ ను తలపించిందంటూ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

ఎవరైనా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు. అలా అనుకోగానే సరిపోదు. ప్రజలు గుర్తుంచుకునేలా పాలన సాగించాలి. స్వపక్షాన్ని డీల్ చేయాలి. విపక్షాలను ఎదుర్కోవాలి. జనాన్ని ఆకట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పనిలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వైసీపీ.. ఇప్పుడు టార్గెట్ 175 అంటోంది. ఈ లెక్క వెనుక వారి ధీమా ఉంది. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా పాలన సాగిస్తున్నారు. పేదలకు మేలు చేసే విషయాల చుట్టూనే జగన్ పథకాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం పస్తులతో ఉండొద్దని, డబ్బులు లేకుండా బడికి, హాస్పిటల్ వెళ్లలేని పరిస్థితి రావొద్దని జగన్ ఏ బహిరంగ సభలోనైనా పదే పదే చెబుతూ వస్తున్నారు. అందుకే డైరెక్ట్ ట్రాన్స్ ఫర్ ద్వారా ఒక్క బటన్ తో నిధులు రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

- Advertisement -

మరోవైపు జగన్ పాలనలో జరిగిన నష్టాలపై టీడీపీ నేతలు ప్రతీ ఏడాది ఛార్జ్ షీట్లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించారంటూ ఫైర్ అవుతున్నారు. జగన్ అధికారంలోకి వస్తూనే ఉండవల్లిలో ఉన్న ప్రజావేదికను కూల్చేయించారు. ఇది అప్పట్లో పెను సంచలనమైంది. ప్రజల డబ్బుతో నిర్మించిన ఈ వేదికను ఇతర ప్రత్యామ్నాయ అవసరాలకు వాడుకొని ఉంటే బాగుండేదన్న వాదన అప్పట్లో వినిపించింది. రాజధాని విషయంలో జగన్ ఫార్ములాపైనా టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. రైతులు దాదాపు 50 వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత కూడా మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడం చాలా విమర్శలకు దారి తీసింది. మరోవైపు అన్న క్యాంటీన్లను మూసేయడంపై చర్చ జరిగింది. పేరు మార్చి పేదలకు పట్టెడన్నం పెడితే బాగుండేదన్న సలహాలూ వచ్చాయి.

రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయంటున్నారు సజ్జల. తన ప్రభుత్వ హయాంలో రుణమాఫీ గురించి చంద్రబాబు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడంటూ సజ్జల ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ మేనిఫెస్టోపై వైసిపి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని గంటా శ్రీనివాస్ రావు మండిపడుతున్నారు. నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఆఫ్గాన్‌ను తలపించిందని, ప్రజా వేదిక కూల్చివేత నుంచి అధికారం ప్రారంభించారని, జగన్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. వైసిపి మేనిఫెస్టో కాగితాలకే పరిమితమైందంటున్నారు టీడీపీ నేతలు. రాజధాని లేకపోవడంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదంటున్నారు. వైసీపీ పాలనలో 226 దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తు చేస్తున్నారు. తాడేపల్లిలో జగన్ ఇల్లు ఇందని పేదవాళ్ల గుడిసెలన్నీ కూల్చేశారని ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ మోసగించారని.. సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారని కౌంటర్లు వేస్తున్నారు. ఆరు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఏడుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కల్తీ మద్యంతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అంటున్నారు.

టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోని అగ్రగామి రాష్ట్రాలతో పోటీపడితే ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మహారాష్ట్రకు ఈ నాలుగేళ్లలో రూ.3.5 లక్షల కోట్లు, కర్ణాటకకు రూ.3.25 లక్షల కోట్లు, గుజరాత్‌కు రూ.2.5 లక్షల కోట్లు, తెలంగాణకు 35 వేల కోట్లు వస్తే.. ఏపీకి కేవలం 5వేల కోట్లే వచ్చాయంటున్నారు. భారీ ప్రచారంతో అట్టహాసంగా నిర్వహించిన విశాఖ గ్లోబల్‌ సమ్మిట్‌లో వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకొన్నవన్నీ ఫేక్‌ ఒప్పందాలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.

ఏపీకి కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న నిధులను.. జగన్ సర్కార్ పేరు మార్చడం, తమ పథకాలుగా చెప్పుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అవుతున్నారు. ఏపీపై ప్రత్యేక శ్రద్ధతో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇస్తోందని జీవీఎల్ అంటున్నారు.

మొత్తంగా తమ నాలుగేళ్ల పాలన స్వర్ణయుగం అని వైసీపీ నేతలు చెప్పుకుంటుంటే.. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ నేతలు టార్గెట్ 160 పెట్టుకుంటే.. వైసీపీ నేతలు టార్గెట్ 175 అంటున్నారు. ఇది ఎన్నికల ఏడాది. మరి జనం ఏం డిసైడ్ అవుతున్నారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News