2014లో చంద్రబాబు అనుభవాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి ఆయనకు అధికారం అప్పగించారు.
2019లో ప్రభుత్వం చేసిన తప్పులతోపాటు, జగన్ కు ఓ అవకాశం ఇచ్చి చూద్దామన్న ఆలోచనతో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు.
2024లో జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు కూటమికి వరంగా మారాయి.
2029 పరిస్థితి ఏంటి?
సింపుల్, కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే వైసీపీదే అధికారం. మరి ఆ తప్పులు జరగకూడదంటే ఏం చేయాలి? అధికారం పోతుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు తప్పులు చేస్తుంది? సరిగ్గా ఈ పాయింట్ పైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. 2029లో అధికార మార్పిడి జరగకుండా ఉండాలంటే ఇప్పట్నుంచే జాగ్రత్తగా ఉండాలనేది ఆయన ఆలోచన, ముందుచూపు. అందుకే అసెంబ్లీలో ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.
ప్రతిపక్షం లేని సభలో..
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష వైసీపీ సభ్యులు సమావేశాలకు హాజరు కావడం లేదు. అంటే చర్చ మొత్తం అధికార పార్టీకి చెందిన కూటమి నేతల మధ్యే జరుగుతోంది. అయితే ఇటీవల కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అత్యుత్సాహంతో చేసిన ప్రసంగాలు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. కొన్నిచోట్ల శాంతి భద్రతల సమస్యలున్నాయని, మరికొన్ని చోట్ల ఉద్యోగుల ట్రాన్స్ ఫర్ల విషయంలో ఎమ్మెల్యేలు వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. వారంతా పరోక్షంగా ప్రభుత్వాన్నే విమర్శించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దని గట్టిగానే చెప్పారట.
ముందు జాగ్రత్తలు..
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరే అయింది. మరో మూడున్నరేళ్లపాటు ఎవరు ఏమన్నా కూటమిదే అధికారం. ఒకవేళ కూటమిలో లుకలుకలు వచ్చినా క్లియర్ కట్ మెజార్టీ టీడీపీదే కాబట్టి సీఎంగా చంద్రబాబు స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు. అలాగని ఆయన రిలాక్స్ కావడం లేదు. 2029 నాటికి ఈ పరిస్థితుల్లో ఎలాంటి తేడాలు రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఇప్పట్నుంచి ఎమ్మెల్యేలను కంట్రోల్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రమశిక్షణ గీత దాటితే సహించేది లేదంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై విమర్శలు రావడంతో వారిని పక్కనపెట్టారు చంద్రబాబు. ఇప్పుడు మరికొంతమందిని సెట్ రైట్ చేస్తున్నారు.
జగన్ చేసిన తప్పు అదే
గతంలో జగన్ హయాంలో కూడా ఎమ్మెల్యేలు కొంతమంది హద్దుమీరు ప్రవర్తించినా ఆయన పట్టించుకోలేదు. సరికదా వారిని మరింత ప్రోత్సహించారు కూడా. మాటల దాడులు, చేతల దాడుల్ని కూడా జగన్ ప్రోత్సహించారని, దానికి తగ్గ మూల్యం 2024 ఎన్నికల్లో చెల్లించుకున్నారనే వాదన ఉంది. ఆ తప్పు కూటమి తరపున 2029లో జరగకూడదనే చంద్రబాబు ఇప్పట్నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీని, నేతల్ని సెట్ రైట్ చేస్తున్నారు. కూటమి పొందిక విషయంలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరు కాస్త గీత దాటినా, వెంటనే ఆ తప్పుల్ని సరిదిద్దుతున్నారు. ప్రస్తుతానికి కూటమి కుదురుగానే ఉంది. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.