AP Rain Alert: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు(శనివారం) ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.
తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలోని భవనాలు వద్ద ఉండరాదని వాతావరణ అధికారులు సూచించారు. సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండడంతో హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు హోంమంత్రి అనిత సూచించారు. అలాగే, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి ఆదేశించారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని అనిత స్పష్టం చేశారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పొంగిపొర్లే కాలువలు, రహదారులు దాటే ప్రయత్నాలు చేయరాదని, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు లేదా శిథిల భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించి, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను లేదా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
వాయుగుండం ప్రభావంతో రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం ఓడరేవు మినహా రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.