Big Stories

CM Jagan: నాలుగేళ్ల పాలన.. నవరత్నాల పాలనేనా?

cm jagan

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చి, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించి ఇప్పుడు జనం ముందు మరో ఎన్నికల కోసం నిల్చున్నారు. ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టేశారు. నవరత్నాలు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నవశకాన్ని సృష్టించారా? ఏపీ తాజా పరిస్థితి ఏంటి? సాధించిన విజయాలేంటి?

- Advertisement -

ఏపీలో నాలుగేళ్ల క్రితం తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం అమలు చేశామని సగర్వంగా చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ సీపీ నాయకులు. అంతేకాదు మరోసారి ప్రజలకు సేవ చేసేందుకు ఈసారి ఏకంగా 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నామని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరగగా… మే 23న రిజల్ట్స్ వచ్చాయి. మే 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 50 శాతానికి పైగా ఓట్లు సాధించి రికార్డు సృష్టించింది. 175 అసెంబ్లీ సీట్లలో 151 స్థానాలు గెలిచింది. అలాగే 25 ఎంపీ సీట్లకు 22 చోట్ల విజయం సాధించింది. ప్రజా సంకల్ప పాదయాత్రతో ప్రజల్లోకి చొచ్చుకుపోయిన జగన్మోహన్ రెడ్డికి.. ఆ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతే కాదు ఇచ్చిన హామీలకు ఫిదా అయ్యారు.

- Advertisement -

అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి ఫార్ములానే ప్రామాణికంగా తీసుకుని జగన్ పాలన కొనసాగుతోంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యమయ్యే హామీలనే జగన్ ఇచ్చారు. ఇప్పుడు వాటిలో చాలా వరకు అమలు చేయడం సులువైందని అంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అంటే 56 శాతం వారికే అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్‌ 11న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో ఈ శాతాన్ని ఏకంగా 70కి పెంచారు. కేబినెట్ నుంచే సామాజిక న్యాయాన్ని మొదలు పెట్టారు. అటు రాజ్యసభకు 8 సీట్లలో నాలుగింటిని బీసీలకే ఇచ్చారు.

నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ ఏపీలో చాలా సమస్యలకు పరిష్కారం చూపారంటున్నారు. నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు. 3 లక్షల ఎకరాలను ఆ జాబితాను తొలగించారు. చుక్కల భూములు, షరతులు గల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు జగన్. పారిశ్రామికంగానూ ముందడుగు వేశామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇందుకు నిదర్శనం కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిషింగ్‌ ల్యాండ్‌లు, 3 ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టామని గుర్తు చేస్తున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ తో పెట్టుబడులను ఆకర్షించగలిగారు.

పౌర సేవల్ని ఏ ఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 1.34 లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65 లక్షల మందితో వాలంటీర్లను ఏర్పాటు చేశారు. 10,592 గ్రామ, పట్టణ హెల్త్‌ క్లినిక్‌లు పెట్టించారు. పేదలకు రేషన్‌ సరుకులు ఇంటి ముందుకే వస్తున్నాయి. దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్‌లు పనిచేస్తున్నాయి. ఏపీ మోడల్ అన్న చర్చ తీసుకురావడానికి కారణం పాలనలో జగన్ తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలే. సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్‌బీకే, రేషన్‌ డోర్‌డెలివరీ, వాలంటీర్‌ వ్యవస్థ.. ఇలా అన్నిటినీ కొన్ని రాష్ట్రాలు స్టడీ చేశాయి.

2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తారని ఆశించినా.. అప్పుడు అపోజిషన్ కే పరిమితం అయ్యారు జగన్. ఓ వైపు కోర్టు కేసులు, మరోవైపు సుదీర్ఘ పాదయాత్ర … ఇలా చాలా ఆటుపోట్ల తర్వాత 2019లో ప్రజావిశ్వాసం పొందారు. ప్రజల నమ్మకం పొందడమే రాజకీయ నాయకులకు ముఖ్యం. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి అదో జడ్జిమెంట్ గా మారుతుంది. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు జగన్. పేదలందరికి ఇళ్లు, అమ్మ ఒడి, పెన్షన్ల పెంపు, ఫీజు రీఇంబర్స్ మెంట్స్, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా వంటి పలు హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానం ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే సర్కార్ జమచేసింది. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తమ అస్త్రంగా వినియోగించుకోనుంది.

2019 మేలో జగన్ అధికారం చేపట్టగా.. ఏడాదిలోపే 2020 మార్చ్ నుంచి కరోనా ప్రపంచంపై తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. అది ఏపీ ఆర్థిక, ఆరోగ్య రంగాలపై ప్రభావం చూపింది. ఒక దశలో ఏపీ నుంచి హైదరాబాద్ కు రోగులు క్యూ కట్టారు. అప్పుడు రాకపోకలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఏపీని ఆరోగ్య రంగంలో ముందుకెళ్లే దిశగా జగన్ చర్యలు చేపట్టారు. ఒక దశలో దేశంలోనే ఎక్కువ కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతి కల్పించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయలని జగన్ డిసైడ్ అయ్యారు. వీటిలో కొన్నింటికి కేంద్రం నుంచి అనుమతులు రాగా…కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను సైతం తీసుకొచ్చారు జగన్. ఫ్యామిలీ ఫిజీషియన్‌ డాక్టర్‌ విధానంలో డయాబెటిక్‌, హైపర్‌ టెన్షన్‌తో పాటు పలు అసాంక్రమిక వ్యాధులను గుర్తించి వైద్యం చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లను నియమించారు. మండలానికో 104, 108 వాహనాలను పెట్టించారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సేవల్లో కొత్త పంథా తెరపైకి వచ్చింది. సామాన్య జనానికి సులువుగా సేవలు అందే పరిస్థితి వచ్చింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా పాలన సాగుతోంది. ప్రతి తల్లీ తన బిడ్డను బడికి పంపితే అమ్మఒడి కింద 15 వేల రూపాయలు అందిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెనకు నేరుగా సొమ్ములిస్తున్నారు. విదేశీ విద్యాదీవెన ద్వారా విద్యార్థులకు చేయూత అందిస్తున్నారు. అటు రైతులకూ వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్ పుట్ సబ్సిడీ, డ్రిప్, స్ప్రింక్లర్ల అందజేత, విత్తన సబ్సిడీ ఇవన్నీ అమలు చేస్తున్నారు.

సంక్షేమ పథకాలను నగదు బదిలీ ప్రక్రియ ద్వారా అమలు చేయడం వల్ల అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే సహాయం ప్రజానీకానికి ఇంత సాఫీగా అందడం ఇదే సర్కార్ హయాంలో తొలిసారి అని అంటున్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 175 గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్న జగన్‌ ఇచ్చిన పిలుపుతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News