Kakinada Fishermen Release: ఏపీలోని కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు.. శ్రీలంకలో 52 రోజుల పాటు నిర్బంధంలో ఉండి చివరకు స్వదేశానికి చేరుకోబోతున్నారు. ఈ ఆపరేషన్ వెనుక ఎంపీ సానా సతీష్ బాబు నిరంతర కృషి, కేంద్ర ప్రభుత్వ సంస్థల సమన్వయం, కోస్ట్ గార్డ్ విభాగాల కీలకపాత్ర పోషించాయి.
52 రోజుల నిర్బంధం
వివరాల్లోకి వెళ్తే.. కె. శ్రీను వెంకటేశ్వర్, కరినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు, బ్రన్మంథం అనే నలుగురు మత్స్యకారులు.. ఇటీవల నాగపట్నంకు ఒక ఫిషింగ్ ట్రాలర్ కొనుగోలు చేయడానికి వెళ్లారు. కానీ నావిగేషన్ లోపం కారణంగా తెలియకుండానే శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారు. దీంతో, శ్రీలంక నావికాదళం ఆగస్టు 4న వారిని అదుపులోకి తీసుకుని జాఫ్నా జైలుకు తరలించింది.
దీంతో వారిని అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవడంతో.. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. మావారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని.. ప్రతిరోజు అధికారులకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని ఆటంకాల వల్ల విడుదల ఆలస్యం అయ్యింది.
దౌత్య చర్చలు
మత్స్యకారుల విడుదల కోసం భారత కాన్సులేట్ అధికారి.. రాజీవ్ నేతృత్వంలో నిరంతర చర్చలు సాగాయి. కానీ భారత ఏజెన్సీలతో సమన్వయం సరిగా లేకపోవడం, అలాగే కోర్టు అనుమతుల ఆలస్యం రావడంతో.. సెప్టెంబర్ 25న విడుదల అవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఈ పరిణామం మత్స్యకారుల కుటుంబాలను మరింత ఆందోళనకు గురిచేసింది.
ఎంపీ సానా సతీష్ బాబు జోక్యం
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏపీ సీఎం ఆదేశాల మేరకు.. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముందుకు వచ్చారు. ఆయన ఈ అంశాన్ని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన స్వయంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి.. ప్రిన్సిపల్ డైరెక్టర్ పంకజ్ వర్మను కలిశారు.
వెంటనే చర్యలు చేపట్టాలని కోరిన తర్వాత.. వర్మ శ్రీలంక కోస్ట్ గార్డ్ కమాండర్ దినేష్ జేతో నేరుగా సంప్రదింపులు జరిపారు. ఈ అత్యవసర చర్చలు ఫలించి, కోర్టు అనుమతులు త్వరితగతిన మంజూరయ్యాయి.
స్వదేశానికి మత్స్యకారులు
సెప్టెంబర్ 26న మధ్యాహ్నం 2 గంటలకు జాఫ్నా జైలులో నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేసి, శ్రీలంక కోస్ట్ గార్డ్ వారిని IMBL వరకు తీసుకువచ్చింది. అక్కడి నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ బాధ్యతలు స్వీకరించి.. సాయంత్రం 6 గంటలకు రామేశ్వరంలోని మండపం బేస్ సమీపానికి తీసుకువెళ్లనున్నారు. ఆ తర్వాత వారిని అధికారికంగా స్వాధీనం చేసుకుని, వారి కుటుంబాల వద్దకు కాకినాడకు పంపనున్నారు.
కుటుంబాల ఆనందం
మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వస్తున్నారని తెలిసిన వెంటనే.. వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
Also Read: ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ
ఈ ఘటన మత్స్యకారులకు రక్షణ కల్పించడం, వారి సమస్యలను త్వరగా పరిష్కరించడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కట్టుబాటు మరోసారి రుజువైంది.