AP Gold Mines: ఏపీలో బంగారు గనులు తవ్వకం ఎప్పటి నుంచి మొదలవుతుంది. కొత్త ఏడాది రావడానికి కేవలం నాలుగు నెలలు ఉంది. ఇంతకీ ఈ ఏడాది ఉత్పత్తి మొదలుపెడుతుందా? లేదా? అన్నదానిపై దక్కన్ గోల్డ్ మైన్స్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఉత్పత్తి మొదలు పెడుతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో అక్టోబరు లేదా నవంబర్ చివరలో మొదలుకావచ్చని అంటున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు ఉత్పత్తికి సిద్ధమైంది దక్కన్ గోల్డ్ మైన్ కంపెనీ. బంగారు ఉత్పత్తిని ఏటా 750 కిలోలు చేర్చాలని, ఆ తర్వాత వెయ్యి కిలోలకు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. అదే జరిగితే దేశంలో బంగారం దిగుమతి తగ్గడం ఖాయమనే వాదన లేకపోలేదు. దేశంలో తొలి ప్రైవేట్ రంగ సంస్థగా డెక్కన్ గోల్డ్ మైన్స్ చరిత్ర క్రియేట్ చేయనుంది.
దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్-DGML కంపెనీకి అనుబంధ సంస్థ జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ జొన్నగిరి ప్రాంతంలో బంగారం గనిని వెలికి తీయనుంది. ఇప్పటికే 250 ఎకరాల భూమిని సేకరించింది. ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఆ ప్లాంట్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే తొలి ఏడాది 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
ఆ తర్వాత వెయ్యి కిలోలకు పెంచనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ హనుమ ప్రసాద్ గురువారం వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. జొన్నగిరి ప్రాజెక్టు అనుమతులు ఈ ఏడాది జూన్ నెలల్లో కేంద్రం నుంచి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందన్నారు.
ALSO READ: విశాఖ హెచ్ పీసీఎల్ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన సిబ్బంది
అది కూడా పూర్తయితే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. దేశంలో ఏటా కేవలం 1.5 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతోంది. ఏటా 1,000 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతోంది. జొన్నగిరిలో ఉత్పత్తి మొదలైతే దేశీయంగా బంగారం లభ్యత పెరుగుతుంది. దిగుమతులపై గణనీయంగా భారం తగ్గనుంది.
దక్కన్ గోల్డ్ మైన్స్ మనదేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో లిథియమ్ గనులు కొనుగోలు చేసింది ఈ సంస్థ. అందుకోసం మాగ్నిఫికా గ్రూప్ ఆఫ్ మొజాంబిక్‌తో కలిసి దక్కన్ గోల్డ్ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. అందులో దక్కన్ గోల్డ్ మైన్స్‌కు 51 శాతం వాటా ఉంది. రాబోయే రోజుల్లో ఈ వాటాను 70 శాతానికి పెంచాలని భావిస్తోంది.
రోజుకు 100 టన్నుల లిథియమ్, టాంటలమ్, ఇతర ఖనిజాలను ప్రాసెస్ చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇదిలావుండగా రాజస్థాన్‌లో రెండు బంగారం గనుల కోసం పెద్ద సంస్థలు పోటీపడుతున్నాయి. కంక్రియా గారా గోల్డ్ బ్లాక్, భూకియా-జగ్‌పురా గోల్డ్ బ్లాక్‌లను రాజస్థాన్ ప్రభుత్వ వేలం వేయనుంది.