Pre Launch Scam: మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం మోసాలు చేసేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. కాకపోతే సరికొత్తగా మోసం చేస్తుంటారు. నమ్మకమే పెట్టుబడిగా బురిడీ కొట్టిస్తారు. ఆశ చూపిస్తారు. గాల్లో మేడలు కడుతారు. ఆకర్షణీయమైన బ్రోచర్లు చూపిస్తారు. ప్రీ లాంచ్ ఆఫర్లంటూ డిస్కౌంట్ల వల వేస్తారు. చివరికి ఆరంతస్తుల నుంచి కింద పడేస్తారు. ఇప్పటికే ఎన్నో దగా వెంచర్స్ పేరుతో మోసం చేశారు. ఇప్పుడు కృతికా ఇన్‌ఫ్రా వంతు. అంతే మధ్యలో ఏమీ మారలేదు.
అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్స్ చూపిస్తే నమ్మోద్దు
హైదరాబాద్ లో వరుసగా ప్రీలాంచ్ ఆఫర్ల మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. ఏదో తక్కువగా వస్తుంది కదా అని ఏమీ చూసుకోకుండా పెట్టుబడి పెట్టారా.. నిండా మునిగినట్లే. 20-30 పర్సెంట్ డిస్కౌంట్ అంటారు. లిమిటెడ్ ఫ్లాట్లున్నాయంటారు. రెగ్యులర్ రేట్ 8 వేలు SFT ఉంటే.. మీకు నాలుగైదు వేలకే వస్తుందంటారు. ఇలా రకరకాలు చెబుతారు. రెరా అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్స్ చూపిస్తారు. పర్మిషన్ కు అప్లై చేసినట్లు స్లిప్స్ చూపిస్తారు. డబ్బులు కడితే పర్మిషన్ ఎంత సేపు వచ్చేస్తుందని అంతా చెబుతారు. కానీ అక్కడే గేమ్ షురువవుతుంది. పర్మిషన్లు తీసుకురారు. రావు కూడా. సో తాజాగా ఎల్బీనగర్ లో కృతిక ఇన్ ఫ్రా చేసిన మోసం చూశాక పర్మిషన్లు వస్తేనే పెట్టుబడి పెట్టాలన్న అలర్ట్ ఇచ్చినట్లైంది.
కృతిక్ ఇన్‌ఫ్రా 200 మంది బాధితులు
అయితే ఇలాగే నమ్మి నట్టేట చాలా మునిగారు. చాలా మంది బాధితులు కృతిక ఇన్ ఫ్రా ప్రీలాంచ్ ఆఫర్లు నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్లు. ఈ సంస్థ ఎండీ పేరు శ్రీకాంత్. ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేశాడని బాధితులు అంటున్నారు. ఇలా సుమారు 200 మంది ఉన్నట్లు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ 50 మంది ఈనెల 17న ఎల్బీనగర్ డీసీపీని కలిశారు. దీంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రీఫండ్ ఇవ్వకపోతే సూసైడే మార్గమంటున్నారు. కొందరు తెలిసిన వారి సజెషన్‌పై బుక్ చేశారు. లోన్లు తీసుకున్నారు, అప్పులు తెచ్చిన కట్టారు. ఇప్పుడు వారి జీవితమే తిరగబడినట్లైంది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తున్నామని కోట్లలో వసూలు చేసి చేతులెత్తేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ.. 2020 నుంచే ఇలా డబ్బులు సేకరించడం, వాటిని సొంతానికి లేదంటే ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం ఇలాంటివి చేస్తూ కథ నడిపించారు. కానీ కడుపు మండిన బాధితులు ఇదిగో ఇలా తెరపైకి రావడంతో మ్యాటర్ బయటికొచ్చింది.
పొజిషన్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు
500+ కస్టమర్లు ఇందులో టెకీలు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. బ్రోచర్లలో లగ్జరీ ఫీచర్లు చూసి 10-20 లక్షలు చెల్లించామని, చివరకు మోసపోయామంటున్నారు. రెరా రూల్స్ కు విరుద్ధంగా అనుమతులు లేకుండానే ప్రీ లాంచ్ పేరుతో ఆట మొదలు పెట్టి రెండేండ్లు గడిచినా డబ్బులు కట్టిన వారికి పొజిషన్ ఇవ్వడం లేదంటున్నారు బాధితులు. ప్రస్తుతం బయటికి వచ్చిన వారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని హేమానగర్ వెంచర్ కు సంబంధించిన బాధితులు. అక్కడ 2 ఎకరాల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ స్థలాన్ని 140 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడని, ఇంకా 40 మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదంటున్నారు బాధితులు. పైగా మరొకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉందంటున్నారు. కృతిక ఎండీ శ్రీకాంత్ పై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయని, బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. బాధితులంతా తేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రీఫండ్ ఎలా అన్నది కీలకంగా మారుతోంది. డబ్బు డైవర్ట్ అయితే రికవరీ ఎలా అన్నది కూడా బాధితుల్లో ఆందోళనగా మారింది.
ప్రీలాంచ్ ఆఫర్లపై జనం అప్రమత్తంగా ఉండాలని ఎందరు చెప్పినా సరే మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉన్నారు. తక్కువకే వస్తుంది కదా అన్న ఆశ వారిని నిండా ముంచేలా చేస్తోంది. నిజానికి ప్రీలాంచ్ ఆఫర్లపై బ్యాన్ ఉంది. రెరా యాక్ట్ కు విరుద్ధం. ప్రీలాంచ్ అంటున్నారంటే రూల్స్ ఉల్లంఘిస్తున్నట్లే అని గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై రెరా వార్నింగ్స్ కూడా ఇచ్చింది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రీలాంచ్ అన్నారా కచ్చితంగా ఏదో మతలబు ఉందని గుర్తించాలి.
ప్రీలాంచ్ పేరుతో జయత్రి గ్రూప్ మోసాలు
ఇటీవలే వెలుగు చూసిన మరో మోసం.. జయత్రి గ్రూప్ ది. కంపెనీ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ ను పోలీసులు జూన్ లో అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దాదాపు 350 మందిని నిండా ముంచినట్లు పోలీసులు గుర్తించారు. జయ ఇన్ఫ్రా పేరుతో టెలికాలర్స్ను నియమించుకుని అమాయకులను ట్రాప్ చేయడమే లక్ష్యంగా మోసాలకు పాల్పడ్డట్లు బాధితులు చెబుతున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్ వద్ద 100 మందికి పైగా ఉద్యోగులతో కూడిన విలాసవంతమైన కార్పొరేట్ కార్యాలయం చూపించడంతో పెద్ద సంస్థ అని జనం నమ్మారు. మొత్తం 300 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారంటున్నారు. భారతి బిల్డర్స్ కొంపల్లి వెంచర్ బాధితులది ఒక్క బాధ కాదు. కొంపల్లిలోని ప్రైమ్ ఏరియాలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో భారతి బిల్డర్స్ వద్ద ల్యాండ్ కొనుగోలు కోసం తామంతా డబ్బులు కట్టామని బాధితులు చెప్పారు. 450 మంది కస్టమర్స్ పొట్ట కొట్టి 200 కోట్ల ల్యాండ్ ఫ్రీగా కొట్టేద్దామని భారతి బిల్డర్స్ చూస్తోందని గతంలో బాధితులు ఆరోపించారు. ఇప్పటివరకు తమకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదని, పైగా తమ డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోయారు. ఇవి జస్ట్ ఉదాహరణలు మాత్రమే.
యాడ్‌లో నటించిన మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
మరో ఎగ్జాంపుల్ చూద్దాం. సాయి సూర్యడెవలపర్స్ ప్రకటనలో నటించిన హీరో మహేశ్ బాబుకు ఏప్రిల్ లో ఈడీ నోటీసులు ఇవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు జనానికి అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు అమ్మారనీ, మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు కూడా చేశారని, అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు తీసుకోవడం, అవకతవకలకు సంబంధించి కేసులు ఫైల్ అయ్యాయి. ఇలా సెలబ్రిటీలు యాడ్స్ చూసి కూడా కొందరు మోసపోతున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలు సిస్టమాటిక్‌గా జరుగుతాయి. వీటిపై అలర్ట్ గా ఉండకపోతే అంతే. హైప్ సృష్టిస్తారు. ఆకర్షణీయ బ్రోచర్లు వేస్తారు. 3D మోడల్స్ అంటారు. వర్చువల్ టూర్లు చూపిస్తారు. హై-రైజ్ లగ్జరీ ఫ్లాట్లు అని ప్రమోట్ చేస్తారు. బ్రోచర్లలో HMDA/GHMC అనుమతులు ఉన్నట్టు తప్పుదారి పట్టిస్తారు. RERA రిజిస్ట్రేషన్ లేకుండా బుకింగ్ చేసుకుంటారు. ఒకే ఫ్లాట్‌ను ఎక్కువ మందికి అమ్మడం, జనం నుంచి సేకరించిన డబ్బును ప్రాజెక్టుకు కాకుండా వ్యక్తిగతంగా వాడడం చేస్తారు. ప్రాజెక్టు ఆలస్యం చేసి, కాంటాక్ట్‌లు కట్ చేస్తారు. రిఫండ్ అడిగితే లీగల్ ఇష్యూస్ అంటారు.
తక్కువకే వస్తుందని పెట్టుబడి పెడితే అంతే..
2025లో మన దగ్గర ఇలా ప్రీలాంచ్ పేరుతో చేసిన మోసాలు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా జరిగాయి. ఇలా ఆఫర్లు పెడితే కొనే వారు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి రియల్ ఎస్టేట్ చేసే వాళ్లు. ప్రీలాంచ్ లో తక్కువకే ఆఫర్లు ఇస్తారు కాబట్టి పెట్టుబడి పెడుతారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంకు అమ్ముకుంటే భారీగా లాభపడుతామనుకుంటారు. మరొకరు మిడిల్ క్లాస్ వాళ్లు. తాము పైసా పైసా కూడబెట్టుకున్న వాటిని ఇలాంటి ప్రీలాంచ్ ప్రకటనలకు మోసపోయి పెడుతారు. తమ దగ్గర ఉన్న డబ్బులకు తగ్గట్లు తక్కువకే వస్తుంది కదా అని నమ్మి పెట్టుబడి పెడుతారు. చివరికి మొత్తంగా గుల్ల చేసుకుంటారు. సో ఈ ఎగ్జాంపుల్స్ చెబుతున్నదేంటంటే.. పూర్తయిన ప్రాజెక్టుల్లోనే పెట్టుబడి పెట్టి కొనుక్కోవడం బెటర్. అన్నేసి లక్షలు పెడుతున్నప్పుడు లాయర్స్, ఇంజినీర్స్, ఫైనాన్స్, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ నుంచి అవసరమైతే సెకండ్ థర్డ్ ఒపీనియన్స్ తీసుకోవాలి. కంపెనీ పనితీరు, ప్రొఫైల్ చూసుకోవాలి. కేసులు ఏమీ లేవని నిర్ధారించుకోవాలి. రెరాలో రిజిస్టర్ అయ్యారా.. పర్మిషన్లు తెచ్చారా ఇవన్నీ చూసుకోవాలి. జస్ట్ అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్ చూసి మోసపోవద్దు. ప్రీలాంచ్ ఆఫర్ చేసిన వారిపై రెరాలో కఠిన చర్యలు ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని లూప్ హోల్స్ ఉంటున్నాయి. కంపెనీలను బ్యాన్ చేస్తే మరో పేరు పెట్టి చెలామణి అవుతూ డబ్బులు దోచేస్తున్న వారెందరో ఉన్నారు. నిజానికి ఇలాంటి కేసుల్లో కొందరే బయటికొస్తున్నారు. కొన్ని కేసులు మాత్రమే పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి.
Also Read: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా..?
చాలా కేసుల్లో రిఫండ్ రికవర్ చేస్తామని పోలీసులు అంటున్నారు. అయితే డబ్బు డైవర్ట్ అయిన తర్వాత రికవరీ కష్టమే. ఈఏడాది 20% మోసాల్లో మాత్రమే ఫుల్ రిఫండ్ వచ్చింది. RERA చట్టం ప్రధాన లక్ష్యం కొనేవారికి రక్షణ కల్పించడం, పారదర్శకత పాటించడం, డెవలపర్లలో జవాబుదారీతనం పెంచడమే. ప్రాజెక్టు రిజిస్టర్ కాకముందే అమ్మకాలు లేదా ప్రమోషన్ చేయడం రూల్స్ కు విరుద్ధం. ఇది మోసాలకు దారి తీస్తుందని జనం గుర్తించగలగాలి. రెరా అప్రూవ్ చేసే వరకు ప్రీలాంచ్ సేల్స్ అమౌంట్స్ తీసుకోవద్దు, ప్రచారం చేసుకోవద్దన్న రూల్ ఉంది. ఇలాంటి ప్రీలాంచ్ మోసాలపై తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెరాకు అప్పిలేట్ ట్రిబ్యునల్ ను నియమించారు. అదే సమయంలో 40 పోస్టులను కూడా ట్రిబ్యునల్ కు మంజూరు చేశారు. మోసపోతున్న బాధితులకు తిరిగి ఆయా కంపెనీల నుంచే రికవరీ ఇప్పించేలా సెట్ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా ఇంకా కఠిన చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందనే దానిపైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Story By Vidya Sagar, Bigtv