Crocs: ప్రస్తుతం హాలీవుడ్ సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ‘క్రాక్స్’ షూస్‌నే వాడుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడిదే ట్రెండ్. అయితే, క్రాక్స్ షూస్ ఓ ముగ్గురి స్నేహితుల ఆలోచనల నుంచి పుట్టిందని మనలో చాలామందికి తెలియదు. అసలు క్రాక్స్ ఎందుకంత ఫేమస్? ఒకప్పుడు ఈ కంపెనీ మూతపడే పరిస్థితికి వచ్చినా.. మళ్లీ పుంజుకుని కొన్ని వేలకోట్ల వ్యాపారంగా ఎలా ఎదిగింది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముగ్గురు స్నేహితులు కలిసి సముద్రంలో ఫిషింగ్ చేస్తున్నారు. అనుకోకుండా వాళ్లలో ఒకరికి ఓ ఐడియా వచ్చింది. అది ఈ ముగ్గురి జీవితాలనే కాదు.. ప్రపంచంలో పాదరక్షల ఫ్యాషన్ ట్రెండ్‌నే మార్చేసింది. అదే ‘క్రాక్స్ షూ’ ఐడియా. నిజానికి ఇవి ముదురు రంగుల్లో ఉండి, చూడటానికి అంత బాగోవు. కానీ, వాటి క్వాలిటీ, ప్రయోజనాల వల్ల క్రాక్స్ ఫుల్ పాపులర్ అయ్యాయి. వీటి ధర ఎక్కువైనా, మన్నిక వల్ల సామాన్యులు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు.
2002లో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో క్రాక్స్ షూ కంపెనీ పెట్టారు. ఓ ఫోర్ట్ లాడర్‌డేల్ బోట్ షోలో క్రాక్స్ మొదటి మోడల్ ‘ది బీచ్’ను రిలీజ్ చేశారు. కానీ, వాటిని కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. దీంతో.. ‘మా షూ ఒక్కసారి తొడిగి చూడండి. మీకు నచ్చకుంటే.. సముద్రంలోకి విసిరేయండి’ అంటూ పబ్లిసిటీ చేశారు. అది చూసి చాలామంది వాటిని కొని ట్రై చేశారు. అలా మొదటి రోజే 200 జతల క్రాక్స్ సేల్ అయ్యాయి. ఆ తర్వాత వాటి కంఫర్ట్ చాలామందికి నచ్చడంతో, క్రాక్స్ షూ సేల్స్ బాగా పెరిగాయి. మరింత జనాల్లోకి వెళ్లాలని 2005లో క్రాక్స్ లోగో మార్చారు. 2006 నాటికి కంపెనీ లాభాలు పెరిగాయి. అయితే, 2007లో అంచనా వేసినంత లాభాలు రాలేదు. స్టాక్ వ్యాల్యూ తగ్గడం మొదలైంది. దీంతో కంపెనీ ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
2008లో కంపెనీ ఆదాయ అంచనాలు బాగా తగ్గిపోయాయి. దాంతో కంపెనీ స్టాక్ వ్యాల్యూ కొన్ని గంటల్లోనే 30% వరకు పడిపోయింది. అదే క్రమంలో రీటైలర్లు ఆర్డర్స్ తగ్గిస్తున్నందున 600 మంది ఉద్యోగులను తీసేస్తామని చెప్పారు. దాంతో కంపెనీ మూతపడుతుంది అనుకున్నారంతా. రిటైల్ మార్కెట్‌లో అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. ఆ నష్టాలు కొన్నేళ్లు కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 624 స్టోర్లలో 75-100 వరకు మూసేశారు. దీంతో 2011లో క్రాక్స్ స్టాక్స్ వ్యాల్యూ దాదాపు 39.4 శాతం పడిపోయింది.
పై నష్టాల నుంచి తప్పించుకోవడానికి కంపెనీ తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్లీ లాభాలు పుంజుకున్నాయి. 2017 నాటికి 300 మిలియన్ జతల బూట్లు అమ్ముడు పోయాయి. అయినా.. నష్టాలను తగ్గించుకునేందుకు 2018లో మెక్సికో, ఇటలీల్లోని కంపెనీ ఆపరేటెడ్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్స్‌ని మూసేశారు. ఆ తర్వాత ఖర్చులు తగ్గడంతో, ఇక అప్పటినుంచి సంస్థ మళ్లీ లాభాల బాటపట్టింది.
అప్పుడప్పుడే లాభాల బాట పడుతుంటే.. అదే సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది. దాంతో, ఇక కంపెనీ మూసేసే పరిస్థితి ఎదురవుతుంది అనుకున్నారు. కానీ.. పరిస్థితి తారుమారైంది. కరోనా వల్ల అందరికీ నష్టాలు మిగిలితే.. ఈ కంపెనీ మాత్రం లాభాలు గడించింది. కారణం.. కరోనా టైంలో అంతా ఇంటికే పరిమితం అవడం. జనాలు బయటికి వెళ్లాల్సిన పనిలేదు. అప్పుడు క్రాక్స్ షూస్ చూసేందుకు ఎలా ఉన్నా.. కంఫర్ట్‌గా ఉంటాయని వీటిని ఎక్కువగా కొనేవారు. ఆన్‌లైన్‌లో అలాంటి వాటికోసం వెతికితే.. ఫస్ట్ ప్లేస్‌లో క్రాక్స్ కనిపించాయి. దాంతో క్రాక్స్‌కి మళ్లీ డిమాండ్ పెరిగింది. కంపెనీ ఆన్‌లైన్ అమ్మకాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. 2020 – 2022ల మధ్య సేల్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో, కంపెనీ మార్కెటింగ్ కోసం సెలబ్రిటీలతో అడ్వర్టైజ్మెంట్స్ చేయించింది. కొత్త మోడల్స్‌ని లాంచ్ చేసింది. దాంతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ మార్కెట్‌లో క్రాక్స్ సేల్స్‌లో దూసుకుపోతున్నాయి.
మిగతా షూలతో పోలిస్తే.. క్రాక్స్ చాలా స్పెషల్. వీటిని తయారు చేయడానికి వాడే మెటీరియల్ సాఫ్ట్‌గా ఉంటుంది. దాని వల్లే కాలికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. డిజైన్‌లో అతుకులు, కుట్లు ఉండవు. పైగా ఈ మెటీరియల్ చాలా కాలం మన్నుతుంది. ఈ షూని చాలాకాలం నీటిలో ఉంచినా పాడవ్వవు. వీటిని శుభ్రం చేయడం చాలా ఈజీ. మన పాదాలను చల్లగా, పొడిగా ఉంచడానికి క్రాక్స్ పైభాగంలోని రంధ్రాలు వెంటిలేషన్ అందిస్తాయి. మొదట్లో వీటిని బోటర్స్, బీచ్‌కి వెళ్లేవాళ్లు మాత్రమే వాడేవారట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వృత్తుల్లో ఉన్నవాళ్లూ క్రాక్స్ వాడుతున్నారు. వీటి పేరుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. క్రొకొడైల్స్ పేరు నుంచి ఇన్‌స్పైర్ అయ్యి వీటికి క్రాక్స్ పేరు పెట్టారు. క్రొకొడైల్స్ ఎలాగైతే నీళ్లలో, భూమ్మీద ఉంటాయో.. అలానే వీటిని కూడా రెండు రకాలుగా వాడొచ్చనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారట.