Road Accident: నాగర్‌కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- శ్రీశైలం హైవేపై లారీని అతివేగంతో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు.. హైదరాబాద్ వైపు కారులో బయలుదేరారు. సుమారు ఉదయం 6 గంటల ప్రాంతంలో వారు హాజీపూర్ సమీపానికి రాగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై అకస్మాత్తుగా లారీ వాహనం దారి మళ్లించడంతో.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగంగా వస్తున్న కారు లారీ వెనుకభాగాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ఘటనలో కారు ఇంజిన్ భాగం పూర్తిగా చిద్రమైపోయింది. లోపల ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదం కారణంగా హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై కొంతసేపు భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. లారీ, కారు రహదారిపై అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తరలించి రాకపోకలను పునరుద్ధరించారు.