Minister Azharuddin: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం తాజాగా శాఖలు కేటాయించింది. ఆయనకు మైనార్టీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థలు(పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్) శాఖలను కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అజారుద్దీన్ కు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంది. మంత్రిగా అజారుద్దీన్ గత నెల 31న ప్రమాణ స్వీకారం. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, అజారుద్దీన్ తో ప్రమాణం చేయించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించడంతో.. తెలంగాణ కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (62) ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జన్మించిన అజారుద్దీన్.. అబిడ్స్ ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య చదువుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ అభ్యసించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి అజారుద్దీన్.. తొలి మూడు టెస్టుల్లో వరుస సెంచరీలు సాధించి సంచలనం రేపారు.
1989లో టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్.. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ, ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
మళ్లీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అజారుద్దీన్ పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే రేవంత్ సర్కార్ అనుహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఎమ్మెల్సీ ఉన్న అజారుద్దీన్ పేరును మంత్రిగా కేబినెట్ సిఫార్సు చేసింది. గవర్నర్ ఆమోదంతో ఇటీవల అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఆయనకు శాఖలు కేటాయించారు.