Ysrcp Politics: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఎన్నికలకు మరో మూడున్నరేళ్లు సమయం ఉంది. ఇప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ చకచకా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్ని విభాగాలకు బలమైన, యువనేతలను నియమించారు. వైసీపీ సోషల్‌మీడియా మాజీ హెడ్ సజ్జల భార్గవ్‌కు కొత్త బాధ్యతలు అప్పగించారట అధినేత.
సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు
వైసీపీ సోషల్ మీడియా విభాగం అంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి గుర్తుకొస్తారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత దూరమయ్యారు. ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరించారాయన.
ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణపై రకరకాల పోస్టింగులు పెట్టారు. ఆ సెగ నేరుగా వైసీపీని తాకింది. అనుకోని పరిస్థితుల్లో వైసీపీ సోషల్ మీడియా విభాగానికి దూరంగా ఉన్నారు. సోషల్‌మీడియా వింగ్‌లో పని చేసేవారి పట్ల విభజించి-పాలించు అన్న కాన్సెప్ట్ మాదిరిగా వ్యవహరించేవారని అధినేత దృష్టికి వెళ్లింది.
సాక్షి డిజిటల్ మీడియా హెడ్‌గా
ఈ కారణంగా చాలామంది సోషల్ మీడియాకు దూరమయ్యారు. అనుకోని పరిస్థితుల్లో భార్గవ్ ఆ పదవికి రాజీనామా చేసినట్టు నేతలు చెబుతారు. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మళ్లీ యాక్టివేట్ అయ్యారు. టీడీపీ నేతలు ఫిర్యాదుతో మంగళగిరి పోలీసులు వివిధ సెక్షన్ల కింద సజ్జల భార్గవ్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్లారు.
అతన్ని అరెస్టు చేయవద్దని పోలీసులు ఆదేశించింది. ప్రస్తుతం ఆ కేసు మెల్లగా నడుస్తోంది. తాజాగా సజ్జల భార్గవ్‌ని సాక్షి డిజిటల్ హెడ్‌గా నియమించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల కొకసారి ఆయన ఆఫీసుకు వస్తున్నారట. డిజిటల్ కంటెంట్ విషయంలో ఉద్యోగులకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన సజ్జల భార్గవ్ ఇప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు.
ALSO READ: జగన్ కృష్ణాజిల్లా పర్యటనలో అపశృతి
ఏ పని చేసినా కచ్చితంగా ప్రస్తుతం ఆ ఛానెల్ డైరెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందే. ఇన్నాళ్లు ఉన్నంత ఫ్రీడమ్ ఆయనకు ఉండదని ఆ పార్టీలో కొందరు నేతల మాట. మరి ఇక్కడైనా ఆయన రాణిస్తురా? ఒత్తిడి పెట్టి అందులో పని చేసేవారిని దూరం చేసుకుంటారా అనేది చూడాలి.