AP Fee Reimbursement: పండుగ వేళ ఏపీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.394.29 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వంలో కాలేజీలకు రూ.4,000 కోట్లు బకాయి పెట్టగా కూటమి ప్రభుత్వం విడతల వారీగా వాటిని చెల్లిస్తుందని కూటమి నేతలు తెలిపారు. ఇప్పటివరకు రూ.1,600 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ బకాయిల్లో రూ. 394.29 కోట్లు చెల్లించేందుకు ఆరు ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు మూడు త్రైమాసికాల ఫీజు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. వీటిని ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. గతంలో మొదటి విడత పూర్తిగా చెల్లించగా, రెండో విడతలో కొంత మేర విడుదల చేసింది. తాజాగా మిగతా బకాయిల మొత్తం విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం బకాయిల విడుదలకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్ ఇయర్ చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించిన రూ.394.29 కోట్లను విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను నేరుగా కాలేజీల అకౌంట్లలో జమ చేస్తారు.
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి, ఫీజులు విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ కావాల్సి ఉంది. అయితే కొన్ని కాలేజీలు మాత్రం విద్యార్థులు ఫీజులు కట్టలేదని అంటున్నాయి. ఫీజులు కట్టకపోయినా సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్పాయి. దీనిపై ప్రభుత్వం సర్వే చేయగా.. చాలా కాలేజీలు విద్యార్థుల నుంచి ముందుగానే ఫీజులు వసూలు చేశాయని తేలింది. దీంతో 2023-24 విద్యా సంవత్సరం ఫీజులను తల్లుల ఖాతాల్లోనే జమచేసే అవకాశం ఉందని సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులు చేసింది. వైసీపీ హయాంలో ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేది. విద్యార్థుల తల్లులు కాలేజీలకు ఆ ఫీజులు చెల్లించేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది.
Also Read: Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్
నిర్ణీత గడువులోగా విద్యార్థుల తల్లులు ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని గ్రహించి, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను డైరెక్టుగా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలోనే జమ చేసేలా మార్పు చేసింది.