Hydra Commissioner: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మకుంట.. పునరుద్ధరణ కార్యక్రమం సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన అనుభవాలు, భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక సాధారణ అభివృద్ధి ప్రాజెక్ట్ కాదని, నిజానికి చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని పేర్కొన్నారు.
గతంలో ఈ ప్రాంతం ఎలా ఉందో గుర్తుచేసుకుంటూ.. కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఆరు నెలల క్రితం వరకు ఈ ప్రాంతం మొత్తం చెత్తతో, బీర్ బాటిల్స్‌తో నిండిపోయేది. స్థానికులు కూడా ఇక్కడ ఉండటానికి ఇష్టపడకుండా ఇళ్ళను ఖాళీ చేసి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అంతలా నిర్లక్ష్యానికి, కబ్జాలకు గురైన ఈ కుంటను మేము తిరిగి జీవం పోశాం. ఇప్పుడు ఇది ప్రజలు బతుకమ్మ ఆడుకునే అందమైన బతుకమ్మకుంటగా మారింది.
కబ్జా నుంచి పునరుద్ధరణ ప్రయాణం
ఈ ప్రాజెక్ట్ సాధ్యమవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం, సూచనలు ముఖ్య కారణమని. మాజీ ఎంపీ వీహెచ్ ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఆ సూచనల ఆధారంగా మేము లీగల్ టీమ్‌తో ఆధారాలు సేకరించాము. 1955కి ముందే ఇక్కడ చెరువు ఉందని స్థానికులు ఫోటోలు ఇచ్చారు. వాటిని కూడా ఆధారాలుగా ఉపయోగించి.. మేము బతుకమ్మకుంటను తిరిగి నిర్మించగలిగాము అని ఆయన అన్నారు.
విమర్శల మధ్య ముందడుగు
ఈ పనిలో అనేక సవాళ్లు ఎదురైనా ముఖ్యమంత్రి ఇచ్చిన ధైర్యం, ప్రజల సహకారంతోనే విజయం సాధ్యమైందని తెలిపారు. ఇక్కడ పైపులు పగిలిపోయాయని, ఇళ్ళు కూల్చేస్తున్నారని ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ మేము ముందే బస్తీవాసులకు ధైర్యం ఇచ్చాం. వారి ఇళ్ళకు నష్టం జరగదని నమ్మకం కలిగించిన తర్వాతే పనులు మొదలుపెట్టాం. అందుకే ఈ ప్రాజెక్ట్ ఇంత విజయవంతంగా పూర్తయింది. అని ఆయన వివరించారు.
ఆర్థిక ప్రాధాన్యత
బతుకమ్మకుంట ఏర్పడటం వలన ఆ ప్రాంతంలో.. రియల్ ఎస్టేట్ విలువలు కూడా పెరిగాయని కమిషనర్ చెప్పారు. ఈ ఏరియాలో 900 ఎకరాల భూమి ఉంది. దీనికి ఇప్పుడు దాదాపు రూ. 50 వేల కోట్ల విలువ ఉంటుందని అంచనా. బతుకమ్మకుంట ఒక్కటే కాక, ఇక్కడి భవిష్యత్తును మార్చగల ప్రాజెక్ట్ ఇది అని ఆయన తెలిపారు.
భవిష్యత్ ప్రణాళికలు
బతుకమ్మకుంట పునరుద్ధరణ ఒక శాంపిల్ ప్రాజెక్ట్ మాత్రమే. ఇంకా నగరంలోని అనేక చెరువులను అభివృద్ధి చేయాలి. అవన్నీ కూడా ప్రజల కోసం అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం. హైడ్రాపై అనేక విమర్శలు వస్తున్నా, మేము సరైన మార్గంలో ముందుకు వెళ్తున్నాం అని తెలిపారు.
Also Read: బతుకమ్మ కుంటను ప్రారంభించిన CM రేవంత్ రెడ్డి..
బతుకమ్మకుంట పునరుద్ధరణ కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు, అది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా. చెత్తకుప్పగా మారిన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దటమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చే విధంగా.. ఈ ప్రాజెక్ట్ నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.