GST Relief To Farmers: జీఎస్టీ 2.0 సంస్కరణలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ పన్ను తగ్గింపుపై రైతులకు అర్థమయ్యే విధంగా ఈ నెల 30, అక్టోబర్ 1న జిల్లా, మండల, రైతు సేవాకేంద్రం స్థాయి వరకు వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన అవగాహన సదస్సులు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తూ దేశంలోనే తొలిసారిగా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని ఢిల్లీరావు తెలియచేశారు. జీఎస్టీ తగ్గింపుపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారన్నారు. రాష్ట్ర ప్రజలకు పన్ను తగ్గింపునకు ముందు, తగ్గించిన తర్వాత గల వ్యత్యాసాన్ని వివరిస్తూ 25 సెప్టెంబర్ (దసరా)నుండి 19 అక్టోబర్ (దీపావళి) వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read: AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు
జీఎస్టీ అవగాహన మాసోత్సవంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలను కేటాయించారన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల, రైతు సేవా కేంద్రాల ద్వారా పన్ను తగ్గింపుపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులను, లబ్ధిదారులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. అద్భుతమైన జీఎస్టీ-అద్భుతమైన పొదుపు అనే నినాదంతో రైతులకు మరింత చేరువ చేయాలని కోరారు.