AP Weather: అక్టోబర్ 1 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7 లక్షల క్యూసెక్కులు ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు ఉండడంతో మొదటి హెచ్చరిక కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
సహాయక చర్యల కోసం 2 NDRF, 3 SDRF బృందాలు కృష్ణా, బాపట్ల, కోనసీమ, అల్లూరి, కర్నూలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు కృష్ణా, గోదావరి నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.
సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో 83,350 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 81, 280 క్యూసెక్కులు
శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 5.93 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.90 లక్షల క్యూసెక్కులు
నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 5.88 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.88 లక్షల క్యూసెక్కులు
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 6.30 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.09 లక్షల క్యూసెక్కులు
మరోవైపు గోదావరి నది వరద భద్రాచలం వద్ద 43.4 అడుగులు, కూనవరం వద్ద నీటిమట్టం 18.46 మీటర్లు, పోలవరం వద్ద 12.01 మీటర్లు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 10.32 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి హెచ్చరిక కొనసాగుతుందని ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. వరద ప్రవాహాలు పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Alsor Read: AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.