Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా.. గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలపై విరుచుకుపడ్డ ఆయన, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఘాటైన ఆరోపణలు గుప్పించారు. ప్రజలకు అసత్యాలను చెప్పడం, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ప్రసంగం – అట్టర్ ప్లాప్ సినిమా పోలిక
గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానిస్తూ.. చంద్రబాబు ప్రసంగం చూస్తే అట్టర్ ప్లాప్ సినిమాకి 100 డేస్ ఫంక్షన్ చేసినట్టుంది అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేయలేకపోయి కూడా.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని చెప్పడం మాయాజాలం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు.
వైఎస్ జగన్ తెచ్చిన పరిశ్రమలను తమ కృషిగా చెప్పుకుంటున్నారంటూ
రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడంలో.. వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకపాత్ర పోషించిందని, అయితే చంద్రబాబు-లోకేష్ ప్రచారం కోసం వాటిని తమ కృషిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఉదాహరణగా, టీసీఎస్, యకోహామా టైర్స్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ వంటి ప్రాజెక్టులు వైఎస్ జగన్ హయాంలోనే వచ్చాయని స్పష్టం చేశారు.
పెట్టుబడిదారులపై అనిశ్చితి
రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి.. ప్రధాన అడ్డంకి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. జత్వాని అనే మహిళను భూచిగ చూపి జిందాల్ సంస్థ పెట్టుబడులు వెనక్కి తీసుకునేలా చేశారని తెలిపారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలు.. కమిషన్ల కోసం పరిశ్రమలపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
ప్రజా ఆస్తుల కట్టబెట్టడం – ఎకానమీపై దెబ్బ
రాష్ట్రంలోని విలువైన ఆస్తులను చంద్రబాబు పాలనలో.. చౌకబారుగా కట్టబెట్టారని అన్నారు. ఉదాహరణకు, రూ. 2000 కోట్ల విలువ చేసే ఆస్తిని లులు గ్రూప్‌కు తక్కువ ధరకు ఇచ్చారని, సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఇష్టానుసారంగా.. అవకాశాలు కల్పించారని ఆరోపించారు.
వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని అమర్నాథ్ హైలైట్ చేశారు.
17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలోకి వచ్చాయి.
పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటయ్యాయి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి.
మిట్టల్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు చర్యలు తీసుకోబడ్డాయి.
ఇవన్నీ వైఎస్ జగన్ పాలనలోనే జరిగినవని, వాటికి చంద్రబాబు కొబ్బరికాయ కొడుతూ క్రెడిట్ తీసుకోవడం.. ప్రజలను తప్పుదారి పట్టించడమేనని అమర్నాథ్ అన్నారు.
సినీ నటులపై వ్యాఖ్యలు
రాజకీయ విమర్శలతో పాటు గుడివాడ అమర్నాథ్.. సినీ నటులపై చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిరంజీవిని అవమానించాల్సిన అవసరం వైఎస్ జగన్‌కు లేదు. కానీ తాగి బాలకృష్ణ ఏది బడితే అది మాట్లాడుతున్నాడు. చిరంజీవిని అవమానించేలా మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు. ఈ సందర్భంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని కూడా ఆయన విమర్శించారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు..
ఇక ఈ విమర్శలు రాజకీయంగా ఏ విధమైన ప్రభావం చూపుతాయో, ముఖ్యంగా పెట్టుబడిదారులు ప్రజలలో నమ్మకాన్ని తిరిగి పొందడంలో ..ఏదైనా మార్పు తీసుకువస్తాయో చూడాలి.