Ap liquor Case: ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం. సిట్ నుంచి ఎవరికి పిలుపు వస్తుందోనని నేతలు, అధికారులు వణికిపోతున్నారు. తాజాగా సోమవారం సిట్ విచారణకు మాజీ మంత్రి నారాయణస్వామి డుమ్మా కొట్టారు. దీంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు అధికారులు.
లిక్కర్ కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది సిట్. ఈ క్రమంలో నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తోంది. జులై 21న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత నారాయణస్వామికి నోటీసులు ఇచ్చింది సిట్. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు.
సోమవారం విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. అనారోగ్యంతోపాటు వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరుకాలేనని తెలిపారు. ఈ నేపథ్యంలో నారాయణ స్వామికి మరోసారి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ హయాంలో గడిచిన ఐదేళ్లు ఎక్సైజ్‌మంత్రిగా ఆయన కొనసాగారు.
మద్యం పాలసీపై కేబినెట్ నిర్ణయాల వంటి అంశాలపై ఆయన్ని ప్రశ్నించే అవకాశముందని అంటున్నారు. ఉన్నట్లుండి స్వామి విచారణకు గైర్హాజరు కావడంతో రకరకాల వార్తలు లేకపోలేదు. స్వామికి ముందుగానే సిట్ నోటీసులు ఇచ్చిందని అంటున్నారు. పార్టీ నుంచి ఆయనకు ఏమైనా సమాచారం రావడం వల్ల వెళ్లలేదని మరికొందరు అంటున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు.
ALSO READ: క్లయిమాక్స్‌కి చేరిన లిక్కర్ కేసు.. గుట్టు బయటపెట్టిన సిట్
ఈ కేసులో 48 మందిని నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. కేవలం 12 మంది మాత్రమే అరెస్టయ్యారు. మరో 8 మంది విదేశాల్లో ఉన్నారు. మరో 28 మందిని ఈలోగా విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ 28 మందిలో నేతలు, అధికారులు ఎవరైనా ఉన్నారా? లేకుంటే కసిరాజ్‌కి చెందినవారు ఉన్నారా? అనేది తెలియాల్సివుంది.
మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటేంటి? ఈ కేసులో ఆయన అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన వివరాలు మేరకు కసిరాజ్ మొదలు మిథున్‌రెడ్డి వరకు అరెస్టు చేశారు అధికారులు. ఈ మధ్య విచారణకు రావాలని వీఎస్ఆర్‌కు నోటీసులు ఇచ్చింది సిట్. కొన్ని సమస్యల కారణంగా ఇప్పుడు రాలేనని, తర్వాత వస్తానని చెప్పారు.
ఈసారి విచారణలో సాయిరెడ్డి ఇంకెన్ని కొత్త విషయాలు బయటపెడతారో చూడాలి. ఏలా చూసినా సాయిరెడ్డి మాత్రం అరెస్టు నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. ఆయన మాదిరిగా మిథున్‌రెడ్డి అప్రూవర్‌గా మారి అసలు విషయాలు అధికారులకు చెబుతారా? లేదా అనేది చూడాలి.