భూమిపై పెట్టుబడి పెడితే అది ఎల్లకాలం నిలిచిపోతుందని. అన్ని పెట్టుబడుల్లో కల్లా భూమిపై పెట్టిన పెట్టుబడే అత్యధిక లాభాలను ఇస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు. నిజానికి కూడా ప్రపంచవ్యాప్తంగా సృష్టించలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే అది భూమి మాత్రమే అని చెప్పవచ్చు. ఎందుకంటే భూమిపై మనుషులకు అవసరం పెరుగుతుంది కానీ ఉన్న భూమి విస్తీర్ణం అనేది ఈ భూగోళంపై పెరగదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. భూమి అవసరం రకరకాలుగా ఉంటుంది పంట పొలాల కోసం వ్యవసాయ భూమి, నివసించడానికి ఇ రెసిడెన్షియల్ ల్యాండ్స్, పారిశ్రామిక అవసరాలకు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఇలా రకరకాలుగా భూమి విభజన జరుగుతుంది.
ఈ మూడింటిలో కూడా పెట్టుబడి రూపంలో భూములను కొనుగోలు చేయవచ్చు. సామాన్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల పైన ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. అయితే రాను రాను భూములకు డిమాండ్ పెరగడం వల్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎకరం వ్యవసాయ భూమి కొనాలంటే కనీసం 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంటి స్థలం కొనుగోలు చేయడానికి చదరపు గజాలలో లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ఆసరా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాలుగా దండాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఫార్మ్ ల్యాండ్ వ్యవసాయ భూమిపై పెట్టుబడి పెట్టండి అని ప్రకటనలు జోరుగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఒక గుంట భూమి కొనుగోలు చేయమని ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయి. అలా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలో డెవలపర్లు మామిడి మొక్కలు పెంచుతామని, టేకు వృక్షాలు పెంచుతామని ఎర్రచందనం మొక్కలు పెంచుతామని ప్రకటనలు ఇస్తున్నారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టడం సరైన ఎంపికేనా కాదా అనేది తెలుసుకుందాం.
నిజానికి ఇలాంటి ఫారం ల్యాండ్ అనేది పూర్తిగా వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది వీటిలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. . మీరు కొనుగోలు చేసే గుంట, పావు ఎకరం భూముల్లో ఎలాంటి వ్యవసాయం చేయాలన్నా కూడా సాధ్యం కాని పని, సాధారణంగా ఇలాంటి స్కీముల్లో ఎకరాల స్థలాలను గుంటలుగా విభజించి విక్రయిస్తుంటారు. ఇందులో ఒక గుంట అంటే 121 గజాలు అని గుర్తించాలి. . ఇప్పుడు ఇలాంటి స్థలాలను కొనుగోలు చేయడంలో ఉన్న రిస్కులను ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం.
>> ఒక గుంట లేదా 121 గజాలు ఉన్నటువంటి వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం వల్ల వీటిని భవిష్యత్తులో రీసేల్ చేయడం అనేది చాలా కష్టతరం అవుతుంది.
>> నిజానికి మీరు అలాంటి స్థలాల్లో మొక్కలు పెంచుతాము, భవిష్యత్తులో భారీగా అభివృద్ధి చేస్తాము రోడ్లు వేస్తాము, మీకు ఒక ఫార్మ్ హౌస్ లో ఉండే అనుభూతి కల్పిస్తాము. రెట్టింపులు లాభాలను ఇస్తాము అంటూ ప్రకటనలతో ఊదరగొడుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి వ్యవసాయ స్థలాల్లో రహదారులు కానీ, లేఅవుట్ అనుమతులు కానీ ఉండవు అన్న సంగతి గమనించాలి.
>> . ఇలాంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వీటిని భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేము అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
>> ఇక మొక్కలు పెంచుతాము వాటిపై వచ్చే రాబడితో మీరు భవిష్యత్తులో లక్షలు సంపాదించవచ్చు అని హామీలు ఇస్తూ ఉంటారు. నిజానికి ఎర్రచందనం మొక్కలు, టేకు మొక్కలు అన్ని వ్యవసాయ భూముల్లో పెరగవు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. . వాటికి వాణిజ్య విలువ రావాలి అంటే అన్ని రకాల భూముల్లోనూ అవి పెరగబోయిన సంగతి గుర్తుంచుకోవాలి. అలాగే ఎర్రచందనం టేకు వంటి మొక్కలను తిరిగి విక్రయించాలి అంటే ఫారెస్ట్ శాఖ అనుమతి ఉండాలి.
>> ఇలాంటి చిన్న చిన్న భూములకు క్లియర్ టైటిల్ ఉండదు. వీటికి సంబంధించిన అప్ డేట్స్ ల్యాండ్ రికార్డ్స్ లో సరిగ్గా ఉండవు, మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు సైతం జరిగే అవకాశం ఉంటుంది
>> కనుక ఫార్మ్ ల్యాండ్స్ లో పెట్టుబడి పెట్టాలంటే, ఇలాంటి డెవలపర్ సంస్థల నుంచి కాకుండా నేరుగా రైతుల వద్ద క్లియర్ టైటిల్ ఉన్నటువంటి వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు.
గమనిక: పైన పేర్కొన్నటువంటి సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనిని ఎలాంటి పెట్టుబడి సలహా కింద తీసుకోకూడదు. బిగ్ టీవీ న్యూస్ వెబ్ పోర్టల్ ఇలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీ ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి బాధ్యత వహించదు.