ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటున్నారు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా తనను తాను ఓ లీడర్‌గా మార్చుకునే పనిలో బిజీ అయ్యారు.అంతేకాకుండా పార్టీ పటిష్టతపైనా దృష్టి సారించారు.ఇటీవల పార్టీలో కాస్త డిస్టబెన్స్ ఎక్కువ అయ్యే సరికి ఆయన కీలక నేతలతో చర్చలు సైతం జరుపుతున్నట్టు తెలిసింది. అటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణంపై వేగంగా చర్యలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే సినిమాలకు పూర్తిగా దూరం అయినట్టు తెలుస్తున్నది.మొన్నటివరకు నిర్మాణంలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కూడా గుమ్మడి కాయ కొట్టేశారు.దీంతో పార్టీని రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేస్తున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఓవైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటూనే అధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. దీనికి తోడు ఇటీవల తిరుపతి కొండ మీద అతిథి గృహాల నిర్మాణాలు చేపట్టాలని ఆయన చేసిన ప్రతిపాదనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తిరస్కరించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం ప్రతిపాదనను తిరస్కరించడానికి గల కారణాలను సైతం టీటీడీ అందులో పేర్కొన్నది. ఇప్పటికే కొండ మీద స్థలం తక్కువగా ఉందని, జనాల రద్దీ వలన అక్కడ అతిథి గృహాల నిర్మాణాలకు అనుమతిఇవ్వలేమని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన జనవరి 3న రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్న దేవస్థానాన్ని దర్శించుకోవడానికి రానున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కొండగట్టు దేవస్థానం ధృవీకరించింది. అంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో టీటీడీ రూ.35.19 కోట్లతో నిర్మించనున్న ధర్మశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆలయ అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. భక్తుల వసతి కోసం 100 గదులతో భారీ సత్రాన్ని టీటీడీ నిర్మించనుంది. అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృషి చేసినట్టు తెలుస్తున్నది.
ఇదిలాఉండగా, ఏపీలో పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని అక్కడ టీడీడీ తిరస్కరించడం.. తెలంగాణలో మాత్రం అనుమతినివ్వడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన నిర్ణయాన్ని టీటీడీ ఎలా తిరస్కరించింది అనే చర్చ సైతం జరుగుతున్నది. మరోవైపు టీడీటీ చెప్పింది సైతం నిజమే కదా? ఇప్పటికే తిరుమలకు భక్తులు వచ్చినప్పుడు అక్కడ స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని.. క్యూ లైన్లను మార్చాలని, దర్శనం త్వరగా జరిగేలా చూడాలని, ఇతర రాష్ట్రాల భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఉన్న కాస్త స్థలంలో అతిథి గృహాలు నిర్మిస్తే ఇకపై భక్తులు నుంచి మరిన్ని ఫిర్యాదులు వస్తాయని టీటీడీ చెప్పడం గమనార్హం.ఇదిలాఉండగా, కొండగట్టు అంజనేయ స్వామి చాలా పవర్ ఫుల్ అని..తనకు మరో పునర్ జన్మను ఇచ్చాడని పవన్ పలుసందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.