BigTV English

TTD on Tirumala tiger attack : భక్తులే జాగ్రత్తగా ఉండాలట.. టీటీడీ ఉచిత సలహా.. షేమ్ షేమ్!

TTD on Tirumala tiger attack : భక్తులే జాగ్రత్తగా ఉండాలట.. టీటీడీ ఉచిత సలహా.. షేమ్ షేమ్!
TTD on Tirumala tiger attack

Chirutha attack in tirumala(AP latest news):

నెల రోజుల క్రితం తిరుమల ఘాట్‌రోడ్డులో బాలుడిపై చిరుతపులి దాడి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు భక్తులు. అదృష్టం బాగుండి ఆ పిల్లాడు బతికి బయటపడ్డాడు. ఇలాంటి ఘటన జరిగితే టీటీడీ ఏం చేయాలి? ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఎన్ని రక్షణ చర్యలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు గట్టి సమాధానమే లేదు. పెద్దగా చర్యలేమీ తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ఓ సమీక్ష సమావేశంతో సరిపుచ్చారనే విమర్శలు వచ్చాయి. గతంలో ఓ చిరుతను పట్టుకున్నారు. ఇంకా పలు చిరుతలు మాటువేసి ఉన్నాయని చెప్పారు. ఇంతలో టీటీడీ ఛైర్మన్‌ మారిపోయారు. పాత పాలకమండలి ఆఖరి సమావేశంలో మీటింగ్ పెట్టుకుని.. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి, ఘాట్‌రోడ్డులో చిరుత సంగతి ఏంటి? గాలికి వదిలేసినట్టేగా!


మనిషి రక్తం రుచి చూసిన మృగాలు ఊరుకుంటాయా? కాలినడక దారిలో మళ్లీ దాడి జరిగింది. టీటీడీ పాలకమండలి నిర్లక్ష్యం, అధికారుల చేతగానితనానికి ఈసారి చిన్నారి ప్రాణం పోయింది. లక్షిత చనిపోయింది. గంటలు గడుస్తున్నా అమ్మాయిని చంపిన జంతువేదో కూడా కనిపెట్టలేకపోయారు. ఇదేం వ్యవస్థ? సీసీటీవీ ఫుటేజ్‌లు లేవా? ఏ కెమెరాలోను ఆ జంతువు విజువల్స్ రికార్డు కాలేదా?

టీటీడీ వైఖరి వల్లే చిన్నారి చనిపోయిందనే ఆక్రోశం లక్షిత స్వగ్రామంలో వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెంకు డెడ్‌బాడీ చేరింది. లక్షితను కడసారి చూసేందుకు ఊరు ఊరంతా కదిలొచ్చింది. కన్నీరు పెట్టింది. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి చనిపోయిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ మరణానికి నూటికి నూరు శాతం టీటీడీదే బాధ్యత అని మండిపడుతున్నారు. ఇటీవల ఓ బాలుడిపై దాడి చేసినప్పుడే.. అధికారులు తగు రక్షణ చర్యలు తీసుకుని ఉండుంటే.. ఇప్పుడిలా నిండుప్రాణం వన్యమృగానికి బలి కాకపోయేదిగా అని ప్రశ్నిస్తున్నారు.


నిత్యం లక్షల్లో భక్తులు కాలినడకన తిరుమలకు వస్తుంటారు. ఆ మార్గంలో చిరుత సంచరిస్తుందంటే టీటీడీ ఏం చేయాలి? నడకమార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం.. చిరుతను బంధించే ప్రయత్నం చేయడం.. భక్తులకు రక్షణ కల్పించడం.. లాంటి చర్యలు అత్యంత వేగంగా తీసుకోవాల్సింది. కానీ, ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తులనే గుంపులు గుంపులుగా వెళ్లాలంటూ సలహా ఇచ్చి ఊరుకున్నారు. ఫలితం.. ఇప్పుడు ఆరేళ్ల పాప మరణం.

లక్షిత మృతితో ఈసారి కూడా టీటీడీ ఈవో.. అటవీ, పోలీస్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మళ్లీ అదే ఉచిత సలహా పడేశారు. కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సెలవిచ్చారు. ఇదేం తీరు? సలహాలు ఇచ్చేందుకేనా టీటీడీ ఉంది? పటిష్ట చర్యలు తీసుకోలేరా? వేల కోట్ల సంపద ఉన్న దేవస్థానం బోర్డు.. శ్రీవారి భక్తుల కోసం ఓ ఫెన్సింగ్ కూడా వేయించలేదా? తిరుమల కొండల్లో తిరుగుతున్న చిరుతలను బంధించలేరా? అంటూ నిలదీస్తున్నారు భక్తులు.

లక్షిత మృతికి సంతాపం వ్యక్తం చేసిన టీటీడీ ఈవో.. కాలినడక మార్గంలో ప్రతి 10 మీటర్లకో సెక్యూరిటీ గార్డును నియమిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6 తర్వాత కాలినడక బాటలను మూసివేయాలని నిర్ణయించారు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు చేశామని అన్నారు.

మరోవైపు, లక్షిత కుటుంబానికి 10లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. టీటీడీ తరఫున రూ.5లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు.. మొత్తం రూ.10 లక్షలు లక్షిత కుటుంబానికి ఇస్తామన్నారు.

ఇంకో ప్రాణం పోయే వరకు ఇలానే మాటలతో కాలయాపన చేస్తారా? లక్షిత చావుకు బాధ్యత వహిస్తారా? మరో ప్రాణం పోదని హామీ ఇవ్వగలరా?

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×